అత్తారింట్లో ‘అల్లుడి కిరాతకం’ | Auto Mechanic murdered his family in Hyderabad | Sakshi
Sakshi News home page

అత్తారింట్లో ‘అల్లుడి కిరాతకం’

Published Wed, Mar 21 2018 2:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Auto Mechanic murdered his family in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉగాది పండగ కోసం అత్తారింటికి వచ్చిన అల్లుడు కిరాతకానికి ఒడిగట్టాడు. అత్తమామలను బయటకు పంపి మరీ భార్య, ఇద్దరు పిల్లలను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. బాబు పాఠశాల సమయం అవుతోందని ఇంటికి తొందరగా వెళ్దామని భర్త అన్న మాటలకు వద్దని సమాధానం చెప్పినందుకు భార్యను, ఇద్దరు పిల్లలను చంపానని మీర్‌పేట ఠాణాలో లొంగిపోయిన నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత వేరుకాపురం పెడదామని ఒత్తిడి తెస్తుండటంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. అయితే ఇద్దరు పిల్లలను కూడా కడతేర్చడం వెనక అసలు ఉద్దేశం ఏమిటనే దిశగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. 

పండగ కోసం వచ్చి..
పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా లింగంపల్లి తెల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన సంగిశెట్టి సురేందర్‌(35) అదే ప్రాంతంలో ఆటో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థికంగా పరిపుష్టంగానే ఉన్న ఇతనికి సొంతకారు కూడా ఉంది. సురేందర్‌కు తొమ్మిదేళ్ల క్రితం వరలక్ష్మి(26)తో పెళ్లయ్యింది. వీరికి నితీష్‌(5), యశస్విని(3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నితీష్‌ తెల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. అయితే ఉగాది పండగ కోసం బడంగ్‌పేటలోని సాయిప్రభు హోమ్స్‌ కాలనీలో ఉండే అత్తారింటికి భార్య, పిల్లలతో కలసి సురేందర్‌ వచ్చాడు. 

పాఠశాల విషయంలో గొడవ..
మంగళవారం తెల్లవారుజామున బాబు పాఠశాల విషయంలో సురేందర్‌కు, వరలక్ష్మికి బెడ్‌రూమ్‌లోనే చిన్నపాటి గొడవ జరిగింది. అయితే ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మామ తుమ్మ మహేశ్‌ను కల్లు తీసుకురావాలని సురేందర్‌ బయటకు పంపించాడు. అత్త జ్యోతి గోధుమపిండి కోసం కిరాణ దుకాణానికి వెళ్లింది. అప్పటికే సురేందర్‌ బెడ్‌ మీద పడుకుని ఉన్న భార్య వరలక్ష్మిని గొంతు నులిమి చంపాడు. అక్కడే ఉన్న కుమారుడు నితీష్‌(5), కుమార్తె యశస్వి ని(3)ని కూడా ఆదే రీతిలో చంపేశారు. ఆ వెంటనే తన కారులో మీర్‌పేట స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఇంటికి వచ్చిన మహేశ్, జ్యోతి ఇంట్లో విగతజీవులుగా పడిఉన్న కూతురు, మనవడు, మనవరాలిని చూసి బోరున విల పించారు. 

ముగ్గురిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, వనస్థలిపురం ఏసీపీ రవిందర్‌రెడ్డి, మీర్‌ పేట సీఐ మన్‌మోహన్, డీఐ మధుసూదన్‌ పరిశీలించారు. డీసీపీ మాట్లాడుతూ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, భార్యాభర్తల మధ్య మనస్పర్థల వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోందన్నారు. 

మీర్‌పేటలో మూడో ఘటన..
భార్యతో పాటు సొంత కూతుళ్లు, కొడుకులను చంపిన ఘటనలు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇప్పటివరకు మూడు చోటు చేసుకున్నాయి. గతంలో సాయినగర్‌ కాలనీలో బాలాపూర్‌కు చెందిన వ్యక్తి భార్య, తల్లి, కూతురును పొట్టనబెట్టుకున్నాడు. అలాగే జిల్లెలగూడలో భార్య, ఇద్దరు పిల్లలను చంపిన ఓ వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. సురేందర్‌ ఘటన మూడోది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement