తప్పుడు పత్రాలతో నిందితులకు బెయిల్‌  | Bail Issued With Fake Jamins To Accused In kamareddy | Sakshi
Sakshi News home page

తప్పుడు పత్రాలతో నిందితులకు బెయిల్‌ 

Published Tue, Nov 19 2019 9:40 AM | Last Updated on Tue, Nov 19 2019 9:40 AM

Bail Issued With Fake Jamins To Accused In kamareddy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పిట్లం మండల కేంద్రంలో జూలై 18న బంగారం దుకాణంలో చోరీ జరిగింది. అంతర్రాష్ట్ర ముఠా పనిగా అనుమానించిన పోలీసులు.. కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. అయితే వీరికి బెయిల్‌ కోసం బోధన్‌ మండలం ఊట్పల్లికి చెందిన ఎండీ గౌస్, గైని సాయిలు పేర్లతో ష్యూరిటీలు లభించాయి. బెయిల్‌పై బయటికి వచ్చిన నిందితులు.. కనిపించకుండాపోయారు. ఈ కేసులో సమర్పించిన జామీన్‌లు కూడా నకిలీవని తేలినట్టు సమాచారం. 

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఇటీవలి కాలంలో నకిలీ జామీను పత్రాల సాయంతో నేరస్తులు బెయిల్‌ పొందుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. కామారెడ్డి పట్టణంతో పాటు, పిట్లం మండల కేంద్రంలో జరిగిన రెండు దొంగతనాలు, దోపిడీ సంఘటనల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు పట్టుకుని, కటకటాల వెనక్కి పంపించారు. అయితే నేరస్తులు తప్పుడు జామీను పత్రాలను సమర్పించి, బెయిల్‌పై విడుదలై తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో వారిని తిరిగి పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది.  

తప్పుడు జామీనుల దందా.... 
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తప్పుడు జామీను పత్రాలను సృష్టించే ముఠాలు చురుకుగా పనిచేస్తోందని పోలీసు యంత్రాంగం అనుమానిస్తోంది. ఇటీవల వెలుగు చూసిన రెండు సంఘటనలపై ఎస్పీ శ్వేత ఆరా తీస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగలకు కూడా జిల్లాలో జామీనులు ఇస్తుండడం విస్మయం కలిగిస్తోంది. దొంగలు పట్టుబడినపుడు బెయిల్‌ పొందడానికి తమకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ప్రయత్నాలు చేయడం సాధారణమే.. బెయిల్‌ కోసం కోర్టుకు సమర్పించాల్సిన జామీను పత్రాలను అప్పటికప్పుడు, స్థానికంగా తయారు చేయించడం కష్టమైన పని.. కానీ నకిలీ పత్రాలతో బెయిల్‌ ఇప్పించే ముఠాలు తయారై నిందితులకు సంబంధించిన వ్యక్తులతో బేరమాడి డబ్బులకు తప్పుడు పత్రాలు సృష్టించి అంటగడుతున్నట్టు ఇటీవల వెలుగు చూసిన సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులకు సులువుగా జామీనులు దొరుకుతుండడంతో పోలీసులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.  

ఏడాదిన్నర క్రితం కామారెడ్డి పట్టణంలోని జయశంకర్‌ కాలనీలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా చోరీకి యత్నించింది. మెలకువతో ఉన్న వాచ్‌మన్‌ ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. దీంతో దొంగలు అతడిపై దాడి చేసి గాయపరిచారు. వాచ్‌మన్‌ అరుపులకు మేల్కొన్న స్థానికులు అటువైపు వస్తుండడాన్ని గమనించిన దొంగలు పారిపోయారు. ఈ కేసులో పోలీసులు మహారాష్ట్రకు చెందిన ముఠాను పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు. అందులో ఒక నిందితుడు కోర్టుకు ష్యూరిటీస్‌ సమర్పించడంతో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత పత్తా లేకుండాపోయాడు. దీంతో అతడిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడికి జామీను ఇచ్చిన వారి కోసం పోలీసులు నిజామాబాద్‌ జిల్లాలోని రెంజల్‌ మండలం దూపల్లికి వెళ్లారు. అయితే జామీను ఇచ్చిన దానోయిన మైసయ్య, జర్పుల వెంకట్‌ అనే పేరు గల వ్యక్తులు ఆ గ్రామంలో లేరని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని అటు కోర్టుకు, ఇటు పోలీసు అధికారులకు నివేదించారు.

తప్పించుకు తిరుగుతున్న నేరస్తులు 
దొంగతనాలు, దోపిడీలలో ఆరితేరిన కొందరు పోలీసులకు చిక్కినా.. బెయిల్‌పై విడుదలయ్యాక తప్పించుకు తిరుగుతున్నారు. కోర్టు పేషీలకు హాజరైతే శిక్షలు పడతాయన్న ఉద్దేశ్యంతో నిందితులు తప్పించుకుంటున్నారు. తప్పుడు ష్యూరిటీలు ఇచ్చి దర్జాగా వారు తమ చోరవృత్తిని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తిరిగి వారు ఎక్కడో ఏదో ఒక సంఘటనలో పట్టుబడితే గానీ కేసుల్లో పురోగతి కనిపించని పరిస్థితి ఉంటోంది.   

తీగలాగితేనే.... 
నకిలీ పత్రాలతో జామీనులు ఇస్తున్న ముఠాకు సంబంధించి లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. తమకు తెలిసిన వారికి జామీను ఇవ్వడానికే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ గుర్తు తెలియని వ్యక్తులకు బెయిల్‌ కోసం ష్యూరిటీస్‌ ఇస్తున్నారంటే.. దానిపై ఆరా తీయాల్సిందేనని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన ముఠాలు అరెస్టయిన సందర్భంలో అందించిన ష్యూరిటీలపై మరింత లోతైన దర్యాప్తు జరిపితే నకిలీ జామీను ముఠా చిక్కే అవకాశం ఉంది. ఆ దిశగా విచారణ జరుపుతున్నామని పోలీసు శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.  

విచారణ జరుగుతోంది.. 
వివిధ కేసుల్లో తప్పుడు జామీనుల విషయం ఇటీవలే తెలిసింది. దీనిపై విచారణ చేపట్టాం. వాటిపై కేసులు నమోదు చేయాలని మా సిబ్బందిని ఆదేశించాం. తప్పుడు జామీనులు సృష్టించేవారి గురించి ఆరా తీస్తున్నాం. ష్యూరిటీల విషయంలో కోర్టు విధులు నిర్వహించే మా సిబ్బందికి తగిన సలహాలు ఇచ్చాం. తప్పుడు పత్రాలు తయారు చేసిన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 
–ఎన్‌.శ్వేత, ఎస్పీ, కామారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement