
పాసుపుస్తకంలో నమోదైన వివరాలు (ఇన్‌సెట్లో) బాధితుడు నాగరాజు
ఆదోని: ఓటీపీ(వన్ టైమ్ పాస్‌వర్డ్) అడిగి సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి అకౌంట్లో ఉన్నదంతా ఊడ్చేశారు. దీంతో బాధితుడు బ్యాంకు అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు..పట్టణంలోని కల్లుబావికి చెందిన ఎం నాగరాజు తాపీమేస్త్రీగా పని చేసేవాడు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న స్థలం అమ్మి వచ్చిన డబ్బుతో అప్పులు చెల్లించాడు. మిగిలిన మొత్తాన్ని స్థానికంగా ఉన్న కరూర్ వైశ్యాబ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. గత నెల 22 నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 11 ఫోన్‌కాల్స్ వచ్చాయి. ‘తాము హైదరాబాద్ బ్యాంకు హెడ్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, దాన్ని అప్‌డేట్ చేసేందుకు సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ నంబరు చెప్పాడంటూ’ సూచించారు.
దీంతో ఫోన్ వచ్చిన ప్రతిసారి నాగరాజు గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీ నంబరు చెప్పుకొచ్చాడు. ఈక్రమంలో మంగళవారం తాను కొన్న మరో ఫ్లాట్‌కు డబ్బు చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లాడు. అదే సమయంలో మళ్లీ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అయితే అతడు బ్యాంకులోనే ఉండడంతో బ్యాంకు మేనేజరు విష్ణువర్ధన్‌రెడ్డి చేతికి ఫోన్ ఇచ్చాడు. మేనేజరు ప్రశ్నించగానే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. కొన్ని రోజులుగా ఇలాగే తనను ఓటీపీ నంబర్లు అడిగారని నాగరాజు చెప్పడంతో అనుమానం వచ్చిన మేనేజరు వెంటనే ఖాతాలో లావాదేవీలు పరిశీలించారు. మొత్తం రూ.2.5 లక్షలు డ్రా అయినట్లు గుర్తించారు. ముంబైలో పలు దుకాణాల్లో ఆ వ్యక్తులు విలువైన వస్తువులు కొని నాగరాజు ఖాతా నుంచి చెల్లింపులు జరిపినట్లు తేలింది. న్యాయం చేయాలని బాధితుడు బ్యాంకు మేనేజర్‌ను కోరాడు. అనంతరం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.