సాక్షి, సిటీబ్యూరో: ఏడాదిగా గుట్టుచప్పుకు కాకుండా బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న ఓ బుకీని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. అతడితో పాటు ఇద్దరు ‘ఉద్యోగులను’ కటకటాల్లోకి పంపినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. వీరి నుంచి రూ.2.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నగరంలోని మంగళ్‌హాట్‌కు చెందిన సుశీల్‌సింగ్ దాదాపు ఏడాది క్రితం బుకీగా మారి క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడ, ఏ మ్యాచ్ జరిగినా ఇతను పరిచయస్తులు, పరిచయస్తులు కాని పంటర్ల నుంచి సెల్‌ఫోన్ ద్వారా పందాలు అంగీకరిస్తూ ఉంటాడు.
పందాలు కాసే వారి నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకోవడానికి పతంగుల వ్యాపారం చేసే నరేన్ సింగ్, బెట్టింగ్‌లకు సంబంధించిన పద్దులు రాయడానికి నిరుద్యోగి సందీప్ కుమార్‌లను ఉద్యోగులుగా నియమించుకున్నాడు. సుశీల్ సింగ్ బెట్టింగ్ రేష్యోను నేరుగా ఢిల్లీ నుంచి గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా ఫోన్‌లో సంగ్రహిస్తాడు. సోమవారం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నేపథ్యంలో వీరు పందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీ తమ బృందాలతో దాడి చేశారు. సుశీల్, నరేన్, సందీప్‌లను పట్టుకుని టీవీ, సెట్‌టాప్ బాక్స్ తదితరాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను మంగళ్‌హాట్ పోలీసులకు అప్పగించారు. సుశీల్‌పై గతంలోనూ మంగళ్‌హాట్ ఠాణాలో రెండు బెట్టింగ్ కేసులు నమోదై ఉన్నట్లు డీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment