
శిశువును 108లో ఒంగోలు తరలిస్తున్న సీడీపీఓ భారతి
మద్దిపాడు: ఆ తల్లికి వచ్చిన కష్టం ఏమిటో తెలియదుగానీ పొత్తిళ్ల శిశువు (బాలుడు)ను చెరువు గట్టుపై ఉంచి మాయమైంది. ఈ సంఘటన మద్దిపాడు మండలం గాజులపాలెం చెరువు వద్ద బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. చెరువు గట్టుపై పసిబిడ్డ రోదనలు విన్న స్థానికులు అంగన్‌వాడీ ఆయా మరియమ్మకు సమాచారం ఇచ్చారు. ఇంతలో అక్కడకు వచ్చిన ధేనువకొండ గ్రామానికి చెందిన వ్యక్తి తాను పెంచుకుంటానంటూ బిడ్డను మేదరమెట్ల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆయా ద్వారా సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ చిలకా భారతి, సూపర్‌వైజర్ జ్యోతి, అంగన్‌వాడీ కార్యకర్త మంజువాణిలు మేదరమెట్లకు వెళ్లి శిశువును స్వాధీనం చేసుకున్నారు. వెంటనే 108లో రిమ్స్‌కు చికిత్స కోసం తరలించారు.
అక్కడి నుంచి ఒంగోలులోని శిశుగృహకు తీసుకెళ్లినట్లు సీడీపీఓ భారతి తెలిపారు. బిడ్డను ఎవరో వదిలేసి వెళ్లారన్న విషయమై గాజులపాలెం వాసులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సమీపంలో ఒడిశాకు చెందిన మహిళలు పలువురు రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసే వారు ఉన్నారని, వివాహేతర సంబంధం వల్లకలిగిన శిశువును ఇలా వదిలించుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పండంటి బిడ్డను అనాథగా వదిలి వెళ్లడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment