జీవిత్ (ఫైల్)
చెన్నై, తిరువొత్తియూరు: ప్రియురాలితో మాట్లాడే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి నదిలో పడవేసిన ప్రియుడు మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం కొల్లిడం నదిలో కనుగొన్నారు. మణచ్చనల్లూర్ నుంచి తిరుచ్చి వెళ్లే మార్గంలో కొల్లిడం నది ఉంది. కొల్లిడం నది వంతెనపై మణచ్చనల్లూరు సమీపం పులివలంకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జీవిత్ తన ప్రియురాలు కళాశాల విద్యార్థినితో కలిసి బుధవారం మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆ మార్గంలో వచ్చిన ఐదుగురు ముఠా సభ్యులు ప్రేమికుల వద్ద గొడవకు దిగారు.
తరువాత విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన జీవిత్‌పై ఆ ఐదుగురు దాడి చేసి అతన్ని కొల్లిడం నదిలో పడవేసి పారిపోయారు. దీన్ని గమనించిన స్థానిక కార్మికులు అక్కడికి వెళ్లి ప్రేమికుడిపై దాడి చేసిన వారిలో ఇద్దరిని పట్టుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పట్టుబడిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో వారు కలైయరసన్, గోకుల్ అని తెలిసింది. వారిద్దర్నీ అరెస్టు చేసి తక్కిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరంగం అగ్నిమాపక వీరులు రెండు రోజులుగా కొల్లిడం నదిలో జీవిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతని ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో మూడో రోజు అయిన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరువెరుంబూర్, పనైపురం ప్రాంతంలోని నది ఒడ్డుకు చేరి ఉన్న జీవిత్ మృతదేహాన్ని శ్రీరంగం అగ్ని మాపక దళం వీరులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై టోల్‌గేట్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment