మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ మారుతీ కృష్ణ
ప్రకాశం, పెద్దదోర్నాల: మాంసం వద్ద చెలరేగిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వండిన మాంసాన్ని పంచుకోవటంలో ఇరువురు సోదరుల మధ్య చోటుచేసుకున్న వివాదం చివరకు హత్యకు దారితీసింది. ఈ సంఘటన మండల పరిధిలోని కొర్రప్రోలు గిరిజన గూడెంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో గూడెంలోని దాసరి అంకన్న (20) తనకు సోదరుడి వరుసైన దాసరి గురవయ్య చేతిలో హతమయ్యాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం సీఐ మారుతీకృష్ణ, పెద్దదోర్నాల ఎస్సై అబ్దుల్ రహిమాన్‌లు సంఘటనా స్థిలికి చేరుకుని సంఘటపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై అబ్దుల్ రహిమాన్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
గూడేనికి చెందిన దాసరి అంకన్న, దాసరి గరవయ్యలు వరుసకు అన్నాదమ్ములు. వీరిద్దరూ ఒకే ఇంటిపేరు కలిగిన కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ఆదివారం చనిపోయిన మేకను కుటుంబంలో అందరూ కలిసి వండుకున్నారు. మేక మాంసం వండించుకోవటంలో దాసరి అంకన్నకు, గురవయ్య మధ్య విభేదం తలెత్తింది. ఈ క్రమంలో ప్లేటులో అన్నం, మాంసం కూర వేసుకుని బయట తినేందుకు వెళ్తున్న అంకన్నను గురవయ్య దుర్భాషలాడుతూ ఎవరికి పెట్టేందుకు వెళ్తున్నావంటూ నిలదీశాడు. ఇరువురి మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. దీంతో ఆగ్రహించిన గురవయ్య వెనుకగా వచ్చి అంకన్న మెడపై కత్తితో దాడి చేయటంలో సంఘటనా స్థలిలోనే అతను మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై అబ్దుల్ రహిమాన్ తెలిపారు. నిందితుడు గురవయ్య పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment