
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి ఏఎంఆర్‌పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, కార్తీక్ అనే బాలుడిని స్థానికులు రక్షించారు. కారు ముందు టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా పీఏపల్లి మండలం వడ్డెరిగూడెం గ్రామానికి చెందిన ఒర్సు రంగయ్య(45), అలివేలు(38), కీర్తి(18)గా గుర్తించారు. వీరంతా ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.