‘కే’ ట్యాక్స్ పేరుతో కోడెల కుటుంబం చేసిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఐదేళ్లుగా కోడెల కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు ఒక్కొక్కరూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. అధికార బలంతో అణచివేతకు గురైన గొంతులు నేడు గళం విప్పుతున్నాయి. లక్షల రూపాయలను ముట్టచెప్పినా ఇంకా కావాలని వేధిస్తుండటంతో ఓపిక నశించిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
నరసరావుపేట టౌన్: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోడెల శివరామ్ చేసిన అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాజీ స్పీకర్ కోడెల తనయుడు కోడెల శివరామ్ గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని వ్యాపారులను బెదిరించి అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జించారు. శివరామ్ అతని అనుచరులు డబ్బుల కోసం ఇంకా వేధిస్తుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్ అనుమతికి రూ.17 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించి అక్రమంగా వసూలు చేయటంపై బాధితుడి ఫిర్యాదుతో కోడెల శివరామ్ అతని ఆంతరంగికుడు గుత్తా నాగప్రసాద్, ఇంజినీర్ వేణుగోపాల్‌రావులపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది.
రామిరెడ్డిపేటకు చెందిన కె.మల్లికార్జున రావు రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో అపార్ట్‌మెంట్ నిర్మించేందుకు అనుమతుల కోసం ఇంజినీర్ ఉన్నం వేణుగోపాల్‌రావును రెండేళ్ల క్రితం సంప్రదించాడు. అనుమతులు కావల్సిన పత్రాలతో పాటు చెల్లించాల్సిన ఫీజులు, మామూళ్లు అందించాడు. అనుమతులు ఇప్పించకుండా వేణుగోపాల్‌రావు కాలయాపన చేస్తూ వచ్చాడు. పనులు ప్రారంభమై సగం పూర్తి అయిన సమయంలో కోడెల శివరామ్‌కు కప్పం చెల్లిస్తేనే అపార్ట్‌మెంట్ నిర్మాణం పూర్తవుతుందని ఇంజినీర్ వేణు హెచ్చరించాడు. అయినప్పటికీ ఖాతరు చేయకుండా మల్లికార్జునరావు నిర్మాణం కొనసాగించడంతో పంచాయతీ సెక్రటరీ భార్గవ్, ఈవోపీఆర్‌డీ శివసుబ్రహ్మణ్యం అక్కడకు వచ్చి పనులను నిలిపివేశారు. కోడెల శివరామ్‌కు కట్టాల్సిన మామూళ్లు (కేట్యాక్స్) చెల్లించిన తర్వాతే నిర్మాణం చేయాలని అలా కాదని నిర్మిస్తే జేసీబీతో కూల్చివేస్తామని బెధిరించారు.
ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు మల్లికార్జున రావును ఇంజినీర్ వేణు గుంటూరులోని కోడెల శివరామ్ కార్యాలయానికి తీసుకువెళ్లాడు. అక్కడ శివరామ్, అతని పీఏ గుత్తా నాగశివప్రసాద్ ఒక్కో ఫ్లాట్‌కు రూ.50 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసి అందరూ ఇస్తుంటే నువ్వెందుకు ఇవ్వవంటూ బెదిరించారు. నగదును వేణుకు అందించి పనులు ప్రారంభించుకోవాలని చెప్పటంతో వారి ఆదేశాల మేరకు రూ.17 లక్షలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకొని మొదట రూ.14 లక్షలు ముట్టచెప్పాడు. మిగిలిన రూ.3 లక్షల కోసం ఇంజినీర్ వేణు గత కొన్ని రోజులుగా బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఈ వ్యవహారాన్ని ఫోన్‌లో రికార్డు చేసి బాధితుడు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. సత్తెనపల్లి, రావిపాడు రోడ్లలో అపార్ట్‌మెంట్‌లు నిర్మించి కేట్యాక్స్‌లు చెల్లించిన మరికొందరు బాధితులు వన్‌టౌన్, రూరల్ పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వాపోయారు.
కోడెల శివరామ్‌పై కేసు నమోదు...
అపార్ట్‌మెంట్ అనుమతుల వ్యవహారంలో బెదిరించి నగదు వసూళ్లు చేసిన కోడెల శివరామ్, అతని పీఏ గుత్తా ప్రసాద్, ఇంజినీర్ వేణులపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ ఏవీ బ్రహ్మం తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment