‘కే ట్యాక్స్‌’పై ఐదు కేసులు | Five cases Booked On K-Tax Against Kodela Siva Prasad Family | Sakshi
Sakshi News home page

‘కే ట్యాక్స్‌’పై ఐదు కేసులు

Published Thu, Jun 13 2019 5:15 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

Five cases Booked On K-Tax Against Kodela Siva Prasad Family - Sakshi

పూనాటి విజయలక్ష్మి , కోడెల శివరాం

నరసరావుపేట టౌన్‌: ‘కే’ట్యాక్స్‌ బాధితుల ఫిర్యాదుల మేరకు మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం, కుమార్తె పూనాటి విజయలక్ష్మిలపై బుధవారం పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మితోపాటు కొల్లి ఆంజనేయులు, కొల్లి నరసింహారావు, పెద్దబ్బాయి మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మబలికి రూ.7 లక్షలు తీసుకొని మోసగించినట్లు పాతూరుకు చెందిన ఆళ్ల శేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 420 కింద చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు. సత్తెనపల్లికి చెం దిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జెల్ది ప్రసాద్‌ నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి కులం పేరుతో దూషించిన కేసులో విజయలక్ష్మిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ సీఐ చిన్న మల్లయ్య తెలిపారు.

పూనాటి విజయలక్ష్మి తన అనుచరుల ద్వారా బెదిరించి అక్రమంగా రూ.10 లక్షలు వసూ లు చేసినట్లు ప్రకాష్‌నగర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తాళ్ల వెంకట కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 384 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఏవీ బ్రహ్మం తెలిపారు. ఈ ముగ్గురు బాధితులు మంగళవారమే పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్‌కు అనుమతుల విషయంలో డాక్టర్‌ కోడెల శివరాం, పీఏ గుత్తా ప్రసాద్‌ తనను బెదిరించి రూ.15 లక్షలు వసూలు చేసినట్లు బిల్డర్‌ కోటపాటి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పొలం ఆక్రమిస్తామంటూ బెదిరించి కోడెల కుమార్తె విజయలక్ష్మి ఆమె అనుచరులు రాంబాబు, శ్రీనివాసరావు తన నుంచి రూ.15 లక్షలు వసూలు చేసినట్లు బాధితురాలు అర్వపల్లి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  

విచారణలో నాలుగు ఫిర్యాదులు 
కోడెల శివరాం, పూనాటి విజయలక్ష్మిలపై ఐదు కేసులు నమోదు కాగా మరో నాలుగు ఫిర్యాదులు విచా రణ దశలో ఉన్నాయి. పొలం విషయంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి, రాంబాబు, శ్రీనివాసరావు తనను బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేసినట్లు నరసరావుపేటకు చెందిన సజ్జారావు శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో డబ్బులు వెనక్కి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. బాధితులకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భరోసా ఇవ్వడంతో వారంతా ఒక్కొక్కరే పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

పరారీలో కోడెల కుటుంబం 
నేరారోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివరాం, విజయలక్ష్మి ప్రస్తుతం అజ్ఞాతంలోకి జారుకున్నారు. వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందన లేనట్లు తెలుస్తోంది. బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ముందస్తు బెయిల్‌ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఓ బాధితుడికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలియడంతో మరికొందరు బాధితులు కోడెల నివాసం, కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు.  

రుజువు చేయండి: కోడెల 
పాత గుంటూరు: తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. కేసులకు ఆధారాలు చూపించి రుజువు చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నూతన ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో అభివృద్ధే ధ్యేయంగా శివప్రసాద్‌ పాలన సాగించారని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement