కూల్చివేసిన ప్రహరీ వద్ద ఎమ్మెల్యే, స్థానికులు
రాజేంద్రనగర్/మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ప్రగతి కాలనీకి వెళ్లే దారికి అడ్డంగా నిర్మించిన గోడను కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తొలగించడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ సర్వే నెంబర్ 161లో మోహన్‌రెడ్డి పేరుపై రెండెకరాలు, శ్రీనాథ్‌రెడ్డి పేరిట 1.36 గుంటల స్థలం ఉంది. ఈ దారి గుండా ప్రగతి కాలనీ, లాల్‌బహదూర్‌శాస్త్రీ కాలనీ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం స్థలం చుట్టూ మోహన్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డిలు ప్రహారీని నిర్మించి గేటును ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని శనివారం సాయంత్రం కాలనీ ప్రజలు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు తెలిపారు. దీంతో ఆయన ఆదివారం ఉదయం స్థలం వద్దకు వచ్చి స్థానికులతో కలిసి ప్రహారీని కూల్చివేశాడు. దీంతో స్థల యజమానులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మంగళవారం స్థల యజమానులు ప్రహారీని పునర్ నిర్మించారు. స్థానికులు విషయాన్ని మరోసారి ఎమ్మెల్యేకు తెలపడంతో ఆయన కాలనీ ప్రజలతో వచ్చి మరోసారి ప్రహారీని కూల్చివేశారు. యజమానులు మరోసారి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్థల యజమాని శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... తమ స్థలంలో ప్రహారీని నిర్మించుకుంటే ఎమ్మెల్యే దౌర్జన్యంగా వచ్చి కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రగతి కాలనీ ప్రజలకు రాకపోకలు సాగించేందుకు దారి ఉందన్నారు. దారి కావాలంటే ప్రభుత్వ పరంగా తమకు తగు స్థలాన్ని లేదా నష్టపరిహారం ఇవ్వాలని.. అదేదీ లేకుండా ఎమ్మెల్యే దౌర్జన్యంగా ప్రహారీని కూల్చి తమను వేధించడం తగదన్నారు. కావాలనే ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తమను వేధిస్తున్నారని ఆరోపించారు.
పరిహారం ఇస్తామని చెప్పా: ఎమ్మెల్యే
ప్రగతి కాలనీ ప్రజలు దశాబ్దాలుగా రోడ్డును వినియోగిస్తున్నారు. ఇదే విషయాన్ని యజమానులకు తెలిపి దారి వదలాలని సూచించా. అందుకుగాను ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని ఇప్పిస్తానని కూడా చెప్పా. కానీ స్థల యజమానులు మాత్రం మొండిగా ప్రహారీని నిర్మించడంతో స్థానికులు ప్రహారీని కూల్చివేశారు.
Comments
Please login to add a commentAdd a comment