
నిందితుడిని చూపి కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ బాలకృష్ణ
నిడదవోలు :వివాహాది శుభకార్యాల సీజన్ వస్తే అతడికి పండుగే.. కల్యాణ మండపాల వద్ద రెక్కీ నిర్వహిస్తాడు. ఒంటరిగా వెళుతున్న మహిళలనే టార్కెట్ చేస్తాడు. హఠాత్తుగా మెడలో ఉన్న మంగళ సూత్రాలు, బంగారు గొలుసులను తెంచుకుని ఊడాయిస్తాడు. ఈ దొంగ ఎట్టకేటకు పోలీసులకు చిక్కాడు. దీనికి సంబంధించిన వివరాలను నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ బుధవారం విలేకరులకు వెల్లడించారు. మహిళల మెడలో బంగారు ఆభరణాలు అపహరిస్తున్న తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన ఘంటా కాశీవిశ్వనా«థ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువ చేసే 22 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎక్కవగా మహిళల మెడల్లోని మంగళసూత్రాలు, గొలుసులే ఉన్నాయి.
పట్టుబడిందిలా..
చాగల్లు గ్రామంలో పేముల కాలువ బ్రిడ్జి వద్ద వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న కాశీవిశ్వనాథ్‌ను ఆపారు. అతని తీరుపై అనుమానంతో విచారించగా, పలు నేరాలకు పాల్పడినట్టు అంగీకరించాడు. నిందితుడికి బావ అయిన తొండ పోతురాజుతో కలసి 2017లో చాగల్లు, చంద్రవరం, కాటకోటేశ్వరం, పురుషోత్తపల్లి, పిట్టల వేమవరం గ్రామాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలు, వివాహాల సమయంలో కల్యాణ మండపాల వద్ద ఉన్న మహిళల మెడల్లో బంగారు ఆభరణాలు అపహరించాడు.
పరారీలో ఉన్న పోతురాజును అరెస్టు చేయాల్సి ఉంది. కేసును ఛేదించిన చాగల్లు ఎస్సై ఎస్.రామకృష్ణ, ఐడీ పార్టీ ఏఎస్సై ఎండీ షరీఫ్, హెచ్‌సీ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు బాల, అనిల్, సునీల్, బాషాలను సీఐ బాలకృష్ణ అభినందించారు. వీరికి రివార్డుల కోసం జిల్లా ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై జి.సతీష్, రూరల్ ఎస్సై కె.రవికుమార్ తదితరలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment