బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
సీతానగరం : నవవరుడి మెడలో నుంచి బంగారు గొలుసు తెంచేందుకు ప్రయత్నించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమరాడ మండలం కళ్లికోట గ్రామానికి చెందిన కె. వెంకటరమణకు రామవరం గ్రామానికి చెందిన యువతితో గత నెల 29న వివాహం అయింది. గురువారం అత్తారింటికి వెళ్లిన వెంకటరమణ శుక్రవారం తిరిగి స్వగ్రామం చేరుకునేందుకు స్కూటీపై వస్తున్నాడు.
సరిగ్గా ఆర్. వెంకంపేట రోడ్డు వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి లిఫ్ట్ కావాలని అడగడంతో వెంకటరమణ వాహనాన్ని ఆపాడు. ఇంతలో అగంతకుడు ఒక్కసారిగా ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసు తెంచేందుకు ప్రయత్నించగా బాధితుడు ఒక్కసారిగా అతడ్ని తోసేశాడు. ఈ క్రమంలో గొలుసు సగం ముక్క బాధితుడి మెడలో ఉండగా, మిగిలిన ముక్క అగంతకుడి వద్ద ఉండిపోయింది.
వెంటనే తేరుకున్న బాధితుడు అగంతుకుడితో పాటు అతడికి సహాయంగా పక్కనే చెరుకుతోటలో ఉన్న ఇద్దరినీ వెంబడించాడు. దీంతో వారు చైన్‌ను వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ విషయమై ఎస్సై సాయికృష్ణ వద్ద ప్రస్తావించగా, నిందితులను పట్టుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment