
బాధిత మహిళ నుంచి ఫిర్యాదు తీసుకుంటున్న పోలీసులు
ఒడిశా, బరంపురం: కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కఠినతరంగా అమలు చేస్తున్నారు. ఇదే అదను చూసుకుని కొంతమంది దుండగులు రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు నేరాలకు నిలయంగా ఉన్న బరంపురం నగరం లాక్‌డౌన్ కారణంగా ప్రశాతంగా ఉందనుకున్న తరుణంలో నగరంలో ఆదివారం జరిగిన చైన్‌స్నాచింగ్ సంఘటన కలకలం రేపింది. ఉదయం పెద్దబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రమా వీధిలో ఉన్న మార్కెట్‌కు వచ్చిన ఓ మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారం చైన్‌ను కొంతమంది దుండగులు లాక్కొని పరారయ్యారు. మోటారుబైక్‌లపై వచ్చిన వారు బాధితురాలు తిరిగి చూసేంతలోపే వారు అక్కడి నుంచి పరారుకావడం గమనార్హం. ఇదే విషయంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల జాడ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
చోరీ విఫలయత్నం
బరంపురం: బీఎన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాబానగర్ 3వ లైన్‌లో ఓ మహిళ మెడలో నుంచి బంగారం చైన్‌ను లాక్కొని పరారయ్యేందుకు దుండగులు చేసిన ప్రయత్నం విఫలమైంది. పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడి మహిళ మెడలో చైన్‌ను లాగేందుకు ప్రయత్నించారు. అయితే అది సకాలంలో తెగకపోవడంతో బాధిత మహిళ అప్రమత్తమైంది. దీంతో వారు అక్కడి నుంచి హుటాహుటిన పరారయ్యారు. అనంతరం బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్‌డౌన్ వేళ.. దుండగుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోందని నగరవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలింగ్ చర్యలు ముమ్మరం చేయాలని పోలీసులను కోరుతున్నారు.