
నిందితుడు మహ్మద్ షరీఫ్
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తెను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆమె స్నేహితురాలితో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి పరారైన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నకు మద్దతుగా అతడి తమ్ముడు బాధితురాలి కుటుంబాన్ని చంపుతానని బెరిరించడంతో వారం రోజుల క్రితం ఫలక్‌నుమా పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే సంఘటన జరిగిన ప్రాంతం నారాయణగూడ పీఎస్ పరిధిలో ఉండటంతో అక్కడి పోలీసులు కేసును నారాయణగూడకు బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా, గడియాగవారం గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ హలీమ్ తయారీ కార్మికుడిగా పని చేసేవాడు. అతడి కుమార్తె కింగ్‌కోఠిలోని ఓ ఇంట్లో పని చేస్తోంది. తరచూ కుమార్తెను చూసేందుకు నగరానికి వచ్చే మహ్మద్ షరీఫ్ ఆమె స్నేహితురాలితో పరిచయం పెంచుకుని గత సెప్టెంబర్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. దీంతో ఇంట్లో తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని మహ్మద్ షరీఫ్‌పై ఒత్తిడి చేయడంతో అన్నకు మద్దతుగా నిలిచిన అతని సోదరుడు మహ్మద్ చంద్ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించడంతో ఆమె ఫలక్‌నుమా పోలీసులను ఆశ్రయించింది. అక్కడి పోలీసులు కేసును నారాయణగూడ పీఎస్‌కు బదిలీ చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ మంగళవారం నిందితులు మహ్మద్ షరీఫ్, మహ్మద్ చంద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment