సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్‌నెట్‌లో లభిస్తున్న మెయిల్ స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఉద్యోగార్థులకు టోకరా వేసిన అంతర్రాష్ట్ర ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ఈ గ్యాంగ్ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో 70 మందికి టోకరా వేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు గురువారం పేర్కొన్నారు. మొత్తం నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని, మిగిలిన ఇరువురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు కోదాడ, మహారాష్ట్ర, చెన్నైలకు చెందిన రేష్మ బేగం, షేక్ నహీమ్, మహ్మద్ అలీ, మహ్మద్ జఫీర్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. తాత్కాలికంగా కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసే రేష్మాతో పాటు అలీ సైతం వివిధ మార్గాల్లో సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన, దానిపై ఆసక్తి ఉన్న వారి ఫోన్ నెంబర్లు సేకరించే వారు. వారికి ఫోన్లు చేసే ఈ ద్వయం విప్రో, అమేజాన్, కాగ్నిజెంట్, ఐబీఎం తదితర మల్టీ నేషనల్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఉన్నాయంటూ చెప్పేవారు. ఆ ఓపెనింగ్స్ విషయం బయటకు తెలియదని, తమకు అందులో ఉన్నతస్థానాల్లో పని చేసే వారితో పరిచయాలు ఉండటంతోనే తెలిసిందని నమ్మబలికే వారు. ఆసక్తి చూపిన వారి నుంచి విద్య తదితర ధ్రువపత్రాలు సేకరించే వారు. ఆయా సంస్థలతో మాట్లాడామంటూ ఉద్యోగార్థులతో చెప్పే రేష్మ, అలీలు త్వరలోనే ఆఫర్ లెటర్ వస్తుందని నమ్మించేవారు. చెన్నైలో ఉంటున్న జఫీర్ సాయంతో నకిలీ ఆఫర్ లెటర్స్ తయారు చేయించేవారు.
వీటిని రేష్మ మెయిల్ స్ఫూఫింగ్ ద్వారా ఉద్యోగార్థులకు పంపేది. కొన్నేళ్ల క్రితం సరదా కోసం ‘సాఫ్ట్ మేధావులు’ రూపొందించిన ఈ స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు ఉగ్రవాదులు, అసాంఘికశక్తులతో పాటు మోసగాళ్లకు సైతం వరంగా మారింది. నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్, సదుపాయాన్ని అందించే వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో అనేకం ఉన్నాయి. ఆయా సైట్స్‌లోకి ఎంటరైన తరవాత మోసగాళ్ళు తమ మెయిల్ ఐడీతో పాటు ఆ మెయిల్ అందుకోవాల్సిన వ్యక్తిది, అలా అందుకునేప్పుడు అతడికి ఎవరి మెయిల్ నుంచి వచ్చినట్లు కనిపించాలో అదీ ఫీడ్ చేసి రిజిస్టర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల సదరు ఉద్యోగార్థికి ప్రముఖ కంపెనీ నుంచే ఈ–మెయిల్ వచ్చినట్లు కనిపించి పూర్తిగా బుట్టలో పడిపోతారు. ఈ స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఎడాపెడా వినియోగించేస్తున్న ఈ మోసగాళ్లు నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో టోకరా వేస్తున్నారు. వారు పేర్కొన్న కంపెనీకి చెందిన మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్‌ను స్ఫూఫ్ చేస్తున్న మోసగాళ్లు వాటి ద్వారా అపాయింట్‌మెంట్ ఆర్డర్, ఆఫర్ లెటర్ వంటివి పంపిస్తున్నారు. వీటిని రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎంత పరిశీలించినా ప్రముఖ కంపెనీ నుంచి వచ్చినట్లే ఉంటుంది. దీంతో సదరు నిరుద్యోగి తనకు ఉద్యోగం వచ్చిందని భావించి ఈ మోసగాళ్ళు చెప్పిన బ్యాంక్ ఖాతాల్లో రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జమచేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగార్థులు నేరుగా సదరు కంపెనీని సంప్రదిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.
అయితే మోసగాళ్లు వీరికి ముందే తామకు ఆయా సంస్థల్లో ఉన్న పెద్ద మనుషులతో సంబంధాలు ఉన్నాయని, వాటి ద్వారానే బ్యాక్‌డోర్ ఎంట్రీలుగా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని చెప్పి ముందరికాళ్లకు బంధాలు వేస్తుండటంతో ఉద్యోగార్థులు నేరుగా ఆయా కార్యాలయాలకు వెళ్లి వివరాలు సేకరించే, సమాచారం సరిచూసుకునే ధైర్యం చేయట్లేదు. ఇదే మోసగాళ్లకు అన్ని సందర్భాల్లోనూ కలిసి వస్తోంది. డబ్బు ముట్టిన తర్వాత మోసగాళ్ళు నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ పంపుతున్నారు. వీటిని పట్టుకుని ఉద్యోగార్థులు ఆయా సంస్థలకు వెళ్ళిన తర్వాతే తాము మోసపోయామని గుర్తించగలుగుతున్నారు. ఈ తరహాలో రేష్మ అండ్ గ్యాంగ్ అనేక మందిని మోసం చేయడంతో ఎస్సానగర్, కేపీహెచ్‌బీ, రాచకొండ సైబర్‌క్రైమ్ ఠాణాల్లో వీరిపై కేసులు నమోదయ్యాయి. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులు తమ బృందంతో వలపన్ని రేష్మ, నహీంలను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.25 లక్షల నగదు, సెల్‌ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. నేహ, అలీనా, స్వప్న తదితర పేర్లతోనూ చెలామణి అయిన రేష్మ బేగంపై గతంలో మాదాపూర్, నారాయణగూడ, మలక్‌పేట, సుల్తాన్‌బజార్, హబీబ్‌నగర్, కేపీహెచ్‌బీ ఠాణాల్లోనూ కేసులు నమోదైనట్లు డీసీపీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment