(ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై : ఖరీదైన పది జతల చెప్పులు పోయాయంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన ఘటన తమిళనాడులోని చెన్నైలో గతవారం చోటుచేసుకుంది. పాదరక్షల మాయంపై ఫిర్యాదుపై పోలీసులు విస్తుపోయినప్పటికీ, చివరికి కేసు నమోదు చేసి చెప్పుల దొంగ కోసం దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే... కీల్పాకం సెక్రటేరియేట్ కాలనీ దివాన్ బహుదూర్ షణ్ముగం రోడ్డుకు చెందిన అబ్దుల్ రఫిక్(46) నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. తన ఇంటి ముందు ఉన్న ర్యాక్‌లో ఉంచిన రూ. 80 వేలు విలువైన 12 జతల షూలు, ఏడు జతల పాదరక్షలు మాయమైనట్టుగా సెక్రటేరియేట్ కాలనీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బ్రాండెడ్ పాదరక్షలను అపహరించుకు వెళ్లారని ఆయన ఇచ్చిన ఫిర్యాదును చూసి పోలీసులు విస్తుపోయారు. కాగా చెప్పులు మాయంపై అబ్దుల్ రఫిక్ ....పొరుగున ఉండే బ్యాచ్‌లర్స్‌తో పాటు తన ఇంట్లో పని చేసే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల చివరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని ఆధారాల కోసం సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా రఫిక్ పొరుగున ఉండే వాళ్లను కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment