
మృతి చెందిన రత్తినప్రియ, వైతీశ్వరన్ (ఫైల్)
విషయం తెలుసుకున్న వైతీశ్వరన్ సోమవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలకు వెళ్లాడు.. అతని శరీరంపై పలుచోట్ల ఎలుకలు..
అన్నానగర్: చిదంబరంలో మంగళవారం ప్రియురాలి మృతిని తట్టుకోలేక మనస్తాపంతో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడలూరు జిల్లా చిదంబరం పరమేశ్వరనల్లూర్ సొక్కలింగం నగర్‌కు చెందిన నారాయణన్ కుమారుడు వైతీశ్వరన్ (22). చిన్న వయస్సులోనే వైతీశ్వరన్ తల్లిదండ్రులను కోల్పోవడంతో చిన్నాన్న శరవణమురుగన్ వద్ద పెరుగుతున్నాడు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన వైతీశ్వరన్ విదేశంలో పని చేసి కొన్ని నెలల కిందట సొంత ఊరికి వచ్చాడు. తరువాత అతను విదేశానికి వెళ్లలేదు. ఈ స్థితిలో వైతీశ్వరన్ చిదంబరం సమీపం కీళమూంగిలడిలో ఉన్న ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న పాండియన్ కుమార్తె రత్తినప్రియ (21) ప్రేమించుకుంటూ వచ్చారు. గత 9వ తేదీ రత్తినప్రియ ప్రియుడితో సెల్‌ఫోన్‌తో మాట్లాడుతుండగా ఇమె తల్లి ఇంధ్ర (45) చూసి మందలించింది.
దీంతో మనస్తాపం చెందిన రత్తినప్రియ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వైతీశ్వరన్ సోమవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలకు వెళ్లాడు. ప్రియురాలు మృతి చెందిన మనస్తాపంతో వైతీశ్వరన్ రాత్రి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుప్పటితో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అతని మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో ఉంచారు. ఈ స్థితిలో మంగళవారం బంధువులు, స్నేహితులు వైతీశ్వరన్ మృతదేహాన్ని చూడటానికి పోస్టుమార్టం గదికి వచ్చారు. అతని శరీరంపై పలుచోట్ల ఎలుకలు కొరికిఉన్నాయి. దీంతో ఆవేశం చెందిన బంధువులు ఆస్పత్రిని ముట్టడించి ఆందోళనకు దిగారు. పోలీసులు వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.