
బంజారాహిల్స్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిరుగుపాటి జయరాం హత్య జూబ్లీహిల్స్‌లో జరిగినట్లు తేలడం స్థానికంగా కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో రాకేష్‌రెడ్డి గత నెల 31వ తేదీన వ్యాపార లావాదేవీలపై మాట్లాడకుందామని తన ఇంటికి పిలిచి ముందస్తు పథకం ప్రకారం దారుణంగా హత్యచేసినట్లు వెల్లడికావడంతో ఈ ఘటన జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించింది. నిన్న మొన్నటి దాకా హత్య ఎక్కడ జరిగిందో తెలియక ఈ ఘటన అయోమయానికి గురికాగా మంగళవారం నందిగామ పోలీసులు హత్య జరిగింది జూబ్లీహిల్స్‌లోనే అని నిర్థారించడంతో మిస్టరీ వీడింది. రాకేష్‌రెడ్డి తన ఇంటికి జయరాంను పిలిపించడం ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడం మాట మాటా పెరగడంతో ఈ హత్య జరిగినట్లు స్పష్టమైంది.
వాచ్‌మన్ శ్రీనివాస్‌తో కలిసి రాకేష్‌రెడ్డి మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించిన విషయం తెలిసి కాలనీవాసులతో పాటు స్థానిక పోలీసులు నిర్ఘాంత పోతున్నారు. ఒక ఇంట్లో హత్య జరిగి..ఆ శవాన్ని కారులో తీసుకుపోతున్నా చుట్టుపక్కల ఏ ఒక్కరికీ తెలియకపోవడం చూస్తుంటే జూబ్లీహిల్స్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ హత్య తమ ఇంటిపక్కనే జరిగిందని తెలిసేసరికి పొరుగున ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. ఇప్పుడంతా ఇదే చర్చ కొనసాగుతున్నది. నెలలో రెండు మూడు వారాలు రాకేష్‌రెడ్డి ఇంట్లో సెటిల్‌మెంట్లు జరుగుతుంటాయని రాత్రిపూటనే చాలామంది వచ్చిపోతుంటారని స్థానికులు తెలిపారు. ప్రతి రోజు ఖరీదైన కార్లలో యువతులు ఇక్కడికి వస్తుంటారని, తరచూ మద్యం పార్టీలు జరుగుతుంటాయని ఇదంతా తమకు సాధారణమైన విషమే అయినా హత్య జరిగిందని తెలిసేసరికి భయబ్రాంతులకు గురయ్యామని స్థానికులు తెలిపారు. విందు వినోదాలకు పోలీసులు కూడా వస్తుంటారని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment