
ఖానాపూర్: తాగిన మైకంలో రెండు నెలల చిన్నారిని తండ్రి ఊయల నుంచి కింద పడేయటంతో మూడు రోజుల తర్వాత ఆ చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానిక పద్మావతినగర్ కాలనీకి చెందిన షేక్‌గౌస్, రిహానాబేగంలకు 57 రోజుల వయస్సు గల చిన్నారి రిజ్వాన్ ఉన్నాడు. గత నెల 28న రిజ్వాన్‌కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో రిహానా కుమారుడిని స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లింది.
బాలుడిని బయటికి ఎందుకు తీసుకెళ్లావంటూ షేక్ గౌస్ భార్యతో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఊయలలోని బాలుడిని కింద పడేశాడు. దీంతో చిన్నారి మెడకు గాయమైంది. ఆస్పత్రిలో చూపించేందుకు డబ్బులు లేక రిహానా తన తల్లిగారి ఊరైన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు వెళ్లింది. సోదరుడి వద్ద డబ్బులు తీసుకుని గత నెల 29న నిర్మల్ ఆస్పత్రిలో చూపించింది. మందులు వాడినా చిన్నారికి నయం కాలేదు. గత నెల 30న చిన్నారి పాలు తాగడం లేదని జగిత్యాలలోని ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్తున్న క్రమంలో పరిస్థితి విషమించింది. మార్గం మధ్యలో ముత్యంపేటలోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే బాలుడు మృతి చెందాడు. చిన్నారి మృతికి తన భర్తే కారణమన్న రిహానా బేగం ఫిర్యాదు మేరకు సీఐ అజ్మీరా పెద్దకుమార్ కేసు నమోదు చేశారు.