సీబీఐ ప్రధాన కార్యాలయంలో మైకేల్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: అగస్టా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మధ్యవర్తి, బ్రిటిషర్ క్రిస్టియన్ మైకేల్‌ను ఢిల్లీలోని ఓ కోర్టు ఐదు రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కస్టడీకి అప్పగించింది. భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్‌ను సీబీఐ అధికారులు నిన్న రాత్రి యూఏఈ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఆయన్ను గట్టి భద్రత నడుమ ఢిల్లీలోని కోర్టు ముందు సీబీఐ అధికారులు హాజరుపర్చారు. అగస్టా కుంభకోణంలో లోతైన కుట్ర దాగుందనీ, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరపడానికి వీలుగా 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయవాది డీపీ సింగ్ కోరారు. దీంతో సీబీఐ ప్రత్యేక జడ్జి.. మైకేల్‌ను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించారు. అగస్టా ఒప్పందంలో భాగంగా మైకేల్ రూ.225 కోట్లు అందుకున్నారనీ, ఈ మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలు, ఐఏఎఫ్ అధికారులకు లంచంగా చెల్లించారని సీబీఐ చార్జిషీటులో తెలిపింది.
అలాగే మైకేల్ కంపెనీ గ్లోబల్ సర్వీసెస్ ద్వారా ఢిల్లీలోని ఓ మీడియా సంస్థలోకి నగదు వచ్చిన విషయాన్ని తాము గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం ముదిరింది. మైకేల్‌పై తప్పుడు వాంగ్మూలం ఇప్పించి ప్రతిపక్ష నేతలపై బురద చల్లేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అగస్టా కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న మైకేల్‌ను కాపాడాలనుకుంటోందా? అని బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు ఇబ్బంది తప్పదా!
మైకేల్‌ను విచారించడం ద్వారా అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ నేతల పాత్రపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయనీ, తద్వారా కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరుకునపెట్టాలని కేంద్రం భావిస్తోంది. విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ వంటి ఆర్థిక నేరస్తులను వెనక్కి రప్పించడంలో బీజేపీ సర్కారు విఫలమయిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టేందుకు మైకేల్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగించుకుంటుందని పరిశీలకులు అంటున్నారు.
ఈ ఒప్పందం కుదరాలంటే సోనియాగాంధీని ప్రసన్నం చేసుకోవాలంటూ 2008లో అప్పటి అగస్టా కంపెనీ భారత్ విభాగం చీఫ్ పీటర్ హ్యూలెట్‌కు రాసిన లేఖలో మైకేల్ సూచించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే మైకేల్ డైరీని సంపాదించారు. అగస్టా ఒప్పందం కోసం ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చింది మైకేల్ తన డైరీలో కోడ్ భాషలో రాసుకున్నారు. కాగా, అగస్టా కుంభకోణానికి సోనియాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు ఒత్తిడి చేసి మైకేల్ చేత బలవంతపు వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించింది.
సల్వార్‌కమీజ్‌లో పారిపోయేందుకు యత్నం!
భారత అధికారులకు దొరక్కుండా ఉండేందుకు మైకేల్ చాలా వ్యూహాలు రచించాడు. తొలుత దుబయ్ పోలీసులు తనను అరెస్ట్ చేయగానే తాను బ్రిటన్ పౌరుడ్ని అయినందున భారత్‌కు అప్పగించడం కుదరదని వాదించారు. వెంటనే అప్రమత్తమైన జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ మైకేల్ చేజారిపోకుండా ఏడాది క్రితం సీబీఐ, నిఘా సంస్థ ‘రా’ అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటుచేశారు. సెప్టెంబర్‌లో దుబయ్‌లోని కోర్టు ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేసింది. దీంతో సల్వార్ కమీజ్, టోపీ ధరించి మారువేషంలో పారిపోయేందుకు మైకేల్ యత్నించగా భారత నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయన్ను పట్టుకున్నారు. దౌత్యమార్గంలోనూ ఒత్తిడి పెంచడంతో యూఏఈ మైకేల్‌ను భారత్‌కు అప్పగించింది.
ఎవరీ మైకేల్?
బ్రిటన్ పౌరుడైన మైకేల్ వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. భారత్ నుంచి అగస్టాకు కాంట్రాక్టులు సాధించిపెట్టడమే మైకేల్ పని. మైకేల్ తండ్రి వోల్ఫ్‌గంగ్ మైకేల్ సైతం 1980లలో వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి ఇండియాలో కన్సల్టెంట్‌గా చేశారు. ఆయన మూడు కంపెనీలు నిర్వహించారు. తరచూ భారత్‌లో పర్యటించే మైకేల్‌కు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్నేహం ఏర్పడింది. పరిచయాలను స్వదినియోగం చేసుకున్న ఆయన భారత్ నుంచి 12 హెలికాప్టర్ల కాంట్రాక్టును అగస్టా కంపెనీకి ఇప్పించేందుకు రంగంలోకి దిగారు.
ఇందుకోసం రాజకీయ నేతలకు, ఐఏఎఫ్ అధికారులకు భారీగా లంచాలిచ్చారు. దీంతో అప్పటివరకూ హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తు పరిమితిని అధికారుల సాయంతో 6,000 మీటర్ల నుంచి 4,500కు తగ్గించగలిగారు. దీంతో అప్పటివరకూ రేసులోనే లేని అగస్టా ఏకంగా కాంట్రాక్టునే ఎగరేసుకుపోయింది. భారత రక్షణ, వైమానిక దళాలకు చెందిన రహస్య పత్రాలు, సమాచారాన్ని సంపాదించిన మైకేల్ ముంబైలోని తన సహాయకుడి ద్వారా దాన్ని వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి చేరవేయగలిగాడు. వీవీఐపీ హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 1997–2013 మధ్యకాలంలో మైకేల్ 300 సార్లు ఇండియాకు వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment