పట్టుబడిన కొలంబియా గ్యాంగ్
బనశంకరి : నగరంలో చోరీలకు పాల్పడుతున్న కొలంబియా దేశానికి చెందిన హైటెక్ ముఠాను జయనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.80 లక్షల విలువ చేసే వజ్రం, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం నగరంలో విలేకరుల సమావేశంలో సునీల్‌కుమార్ వివరాలను వెల్లడించారు. కొలంబియా దొంగల అరెస్ట్‌తో విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్‌ముఖర్జీ, సదాశివనగరలో మాజీ ఎమ్మెల్యే ఇళ్ల్లలో చోరీ కేసుల ఆచూకీ లభించింది. గత మేనెలలో కొలంబియా నుంచి ఢిల్లీకి చేరుకుని అక్కడ నుంచి బెంగళూరు వచ్చి ఓ విల్లాను అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.
నిందితులు బోగూటౌదజోస్ ఎడ్వర్డ్స్ అరివాలో బర్బానో, గుస్తావోఅడాల్పోజరామిల్లోజరాల్డో, యామిర్ అల్బరాట్సస్యాంచియాస్, ఎడ్వర్డ్స్ ఎలెక్సిస్‌గార్సియాపరమోతో పాటు కింబర్లి గుటియారిస్ అనే మహిళ కూడా ఈ ముఠా సభ్యురాలు. ఐదుగురు ముఠా జేపీ.నగర, హెచ్‌ఎస్‌ఆర్.లేఔట్, హెచ్‌ఏఎల్, బాణసవాడి, జయనగర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. బెంగళూరు నగరంలో శ్రీమంతులు అధికంగా నివసించే ప్రాంతా లను గూగల్‌లో గాలించి వారి ఇళ్లలో చోరీలకు తెగబడుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. పోలీసులకు పట్టుబడిన దొంగల్లో జోస్ హైస్కూల్ వరకు విద్యనభ్యసించగా, గుస్తావో ఎంబీఏ పట్టభద్రుడు, యామిర్ వెల్డర్‌గా ట్రైనింగ్ చేశాడు. ఎడ్వర్డ్ çఫుడ్‌హ్యాండింగ్ కోర్సు పూర్తిచేయగా, మహిళ కింబర్లి బిజనెస్ టెక్నాలజీ డిగ్రీ మధ్యలో నిలిపివేసి నేరకార్యకలాపాల్లో భాగస్వాములయ్యారు.
జైలు పక్షులు
పోలీసులకు పట్టుబడిన కొలింబియా దొంగల గ్యాంగ్‌లో జోస్ కొలంబియాలో అక్రమంగా పిస్తోల్ కలిగి ఉన్నందుకు 5 నెలల శిక్ష అనుభవించాడు. 2016లో ఇద్దరు స్నేహితులతో కలిసి నేపాల్ ద్వారా భారత్ అక్కడనుంచి బెంగళూరు నగరానికి చేరుకుని నగరంలో ఆఫ్రికన్‌తో పరిచయం చేసుకుని ఇళ్లల్లో చోరీలకు పాల్పడేవాడు. గుస్తావో 1996లో కొలంబియా పోలీస్ అధికారి కుమారుడి హత్యకేసులో 16 ఏళ్లు జైలుశిక్షను అనుభవించాడు. యామిర్ మెక్సికోలో చిన్నపాటి ఉద్యోగం చేశాడు. 2015లో ఇతను అక్రమ వీసా కారణంగా అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఎడ్వర్డ్స్‌గ్రాసియా, మహిళ కింబర్లి ఇద్దరు అక్రమ వీసాతో జైలు శిక్షను అనుభవించారు. వీరిందరికీ స్పానిష్ భాష మాత్రమే తెలియగా వీరిలో యామిర్‌కు ఇంగ్లీష్ కూడా వస్తుంది.
జీపీఎస్ ద్వారా ఇళ్లు గుర్తింపు
కొలంబియా ముఠా జీపీఎస్ మ్యాప్‌లో శ్రీమంతుల ఇళ్ల కోసం పగలు, రాత్రి సంచరించి ఇళ్ల వద్ద కార్లు ఉన్నాయా లేదా అని గుర్తించేవారు. మొదట ముఠాలోని ఓ మహిళ ఇంటి వద్దకు వెళ్లి కాలింగ్‌బెల్ నొక్కి ఇంటిలో ఎవరూ లేకపోతే ఆ సమాచారాన్ని వెంటనే సమీపంలోని గ్యాంగ్ సభ్యులకు వాకీటాకీ ద్వారా తెలిపేది. గ్యాంగ్ కు టూల్స్ తీసుకవచ్చి తలుపు బద్దలు కొట్టి చోరీలకు పాల్పడేవారు. దూరంలో కారులో కూర్చున్న సభ్యురాలు కింబర్లి వాకీటాకీలో సూచనలు చేస్తే నిఘాపెట్టేది. చోరీకి పాల్పడిన బంగారు ఆభరణాలను కరిగించి బంగారు బార్‌లను తయారు చేసేవారు. జయనగరలో గతనెలలో చోటుచేసుకున్న చోరీ కేసు ఆచూకీ కనిపెట్టడానికి ప్రత్యేక పోలీస్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విచారణ చేపట్టి జూలై నెలలో చోటుచేసుకున్న మరో చోరీ కేసును పరిశీలించి ఓఎల్‌ఎఫ్, ఫ్లిప్‌కార్టు తదితర ఇతర ఆన్‌లైన్ విక్రయాలపై నిఘా పెట్టారు. కారు కొనుగోలు చేసి విక్రయిస్తున్న డీలర్లను పరిశీలించగా కొలంబియా ముఠా ఆచూకీ లభించిందని సునీల్‌కుమార్ తెలిపారు. సమావేశంలో ఏసీపీ బీకే .సింగ్, డీసీపీ డాక్టర్ శరణప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment