సాక్షి, సిటీబ్యూరో: ‘ఆమె’ కోసం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి... సైబర్ నేరంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడిన పాకిస్థాన్ జాతీయుడు మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ కేసులో అధికారులు అత్యంత కీలకమైన ‘కాన్సులర్ యాక్సస్’ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తీహార్ జైల్లో రెండు రోజుల క్రితం ఈ తంతు పూర్తి చేశారు. అతడి జాతీయత నిర్ధారణలో ఈ ఘట్టం అత్యంత కీలకమని, ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కాన్సులేట్ అధికారులకు అనేక కీలక పత్రాలు అందించామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సోమవారం తెలిపారు. ఇతడికి ఆ దేశం జారీ చేసిన పాస్‌పోర్ట్, దాని ఆధారంగా తీసుకున్న వీసాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పటికే లేఖ రాశారు. ఈ ఏడాది జూన్ ఆఖరి వారంలో ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా ఈ లేఖను పంపారు.
భారతీయుడిగా నమ్మించి వివాహం...
పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడ ఆమెకు పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. తాను భారతీయుడినేనని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలియడంతో సదరు మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. 2011లో ఉస్మాన్ సైతం హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చానంటూ చెప్పాడు. వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చిన అతను అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి అట్నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు.
‘కూతురినే’ వేధించి కటకటాల్లోకి...
ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు అతడిని దూరంగా ఉంచింది. దీంతో కక్షకట్టిన అతను ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు తీయడంతో పాటు కొందరికి ఆన్‌లైన్‌లో విక్రయించానంటూ ఆమెను బెదిరించాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధితురాలి స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. గత నెలలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్ పాస్‌పోర్ట్ సైతం తీసుకున్నట్లు వెల్లడైంది. సర్టిఫికెట్ల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసినట్లు బయటపడింది.
నిర్థారించాలంటే ‘ధ్రువీకరించాల్సిందే’...
ఇతడిని అరెస్టు చేసినప్పుడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ చదివినట్లు ఉన్న సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపుకార్డులతో పాటు పాక్ పాస్‌పోర్ట్‌నకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సర్టిఫికెట్ల ఆధారంగా 2003లో టెన్త్, 2003–05ల్లో ఇంటర్, 2005–08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. ఇప్పటికే వీటిని తయారు చేసి ఇచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా ఇవన్నీ తప్పని తేలాలంటే ఆ సమయంలో ఇక్రమ్ భారత్‌తో లేనట్లు నిర్థారించాల్సి ఉంది. వాస్తవానికి ఇక్రమ్ 2009 వరకు పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌లో ఉన్నాడు. అతడు పాక్ జాతీయుడనే అంశంతో పాటు ఈ విషయాన్నీ పాక్ «ధ్రువీకరిస్తేనే బోగస్ వ్యవహారం నిర్థారణ సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఎంఈఏ ద్వారా ఇప్పటికే లేఖ రాశారు.
తీహార్‌కు వచ్చిన కాన్సులేట్ అధికారులు...
దాదాపు వారం రోజుల క్రితం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్రమ్‌ను కోర్టు అనుమతితో తీహార్ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం జైలులో ఇక్రమ్‌ను కలిసిన పాకిస్థాన్ కాన్సులేట్ అధికారులు అతడితో మాట్లాడటంతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఇతడి అరెస్టు నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న పాక్ పాస్‌పోర్ట్ జిరాక్సు ప్రతినీ అధికారులకు కాన్సులేట్ వారికి అందించారు. దీన్నే సాంకేతికంగా ‘కాన్సులర్ యాక్సస్’ గా పేర్కొంటారని అధికారులు తెలిపారు. ఈ వివరాలు సరిచూసిన తర్వాత కాన్సులేట్ అధికారుల జవాబు ఇవ్వడంతో పాటు ఇక్రమ్‌కు అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను జారీ చేస్తారు. వీటి ఆధారంగానే ఈ కేసులో శిక్ష పడితే అది పూర్తయిన తర్వాత, వీగిపోతే తక్షణం ఇక్రమ్ పాక్ వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇక్రమ్ తమ పౌరుడు కాదని పాక్ జవాబు ఇస్తే... అసలు ఈ కేసులో సాంకేతిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై పాక్ నుంచి సమాధానం వచ్చిన తర్వాతే ఎలా ముందుకు వెళ్లాలన్నది నిర్ణయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment