వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారే బాలికపై.. | Cop Harasses Teen Who Tried To File Case In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారే బాలికపై..

Published Thu, Jul 25 2019 2:59 PM | Last Updated on Thu, Jul 25 2019 4:26 PM

Cop Harasses Teen Who Tried To File Case In Uttar Pradesh - Sakshi

కాన్పూర్‌ : తనను లైగింకంగా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ 16 ఏళ్ల బాలికకు చేదు అనుభవం ఎదురైంది. బాలిక ఫిర్యాదును స్వీకరించకపోవడమే కాకుండా.. అభ్యంతరకర ప్రశ్నలు అడిగి ఆమెను వేధింపులకు గురిచేశాడో పోలీసు అధికారి. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలకు జరిగే అవమానాలకు ఇది నిదర్శనం అని ప్రియాంక అన్నారు. కాగా బాలికను వేధింపులకు గురిచేసిన హెడ్‌ కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు.

వివరాలు.. కాన్పూర్‌ చెందిన ఓ దినసరి కూలీల కుమార్తెను గత కొద్దిరోజులుగా కొంత మంది దుండగులు లైగింకంగా వేధిస్తున్నారు. వారి వేధింపులకు తట్టుకోలేక బాలిక కుటుంబ సభ్యులతో కలిసి  పోలీసులను సంప్రదించారు. తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిన హెడ్‌ కానిస్టేబుల్‌ థార్‌బాబు ఆమెను అసభ్యకర ప్రశ్నలు అడుగుతూ వేధింపులకు గురిచేశారు.

‘చేతికి ఉంగరం ఎందుకు ధరించావు? నీకు నెక్లెస్‌ ఎందుకు? నువ్వు చదువుకోలేదు కానీ ఒంటి నిండా బంగారం వేసుకున్నావు. ఇవన్ని ధరించాల్సిన అవసరమేంటి? ఇవి చాలు నువ్వు ఎలాంటి దానివో అర్థం చేసుకోవడానికి’  అంటూ హెడ్‌ కానిస్టేబుల్‌ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించారు. బాలిక తల్లిదండ్రులు సమాధానం చెప్పబోతుండగా వారిని అడ్డుకున్నారు. బాలిక ఎం చేసిందో మీకు ఎలా తెలుసు? మీరు ప్రతిసారి ఇలా వచ్చి ఇబ్బంది పెట్టకండి అంటూ వారిపై సీరియస్‌ అయ్యారు. ఇదంతా అక్కడే ఉన్న బాలిక సోదరుడు మొబైల్‌ ద్వారా వీడియో తీశారు. ఆ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

కాగా ఈ వీడియోను కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేస్తూ రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా వేధింపులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘ రాష్ట్రంలో ఒకవైపు నేరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తున్నారు’  అంటూ వైరల్‌ అయిన వీడియోను పోస్ట్‌ చేశారు. కాగా ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు స్పందించారు. విచారణ ప్రారంభించామని, త్వరలోనే సదరు హెడ్‌ కానిస్టేబుల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement