రెండక్షరాల ప్రేమను.. మూడక్షరాల వ్యామోహం కబళిస్తోంది. ఒకప్పడు ప్రేమ అంటే ఎంతో పవిత్రంగా భావించేవారు.ఒకసారి ఇష్టపడితే జీవితాంతం భాగస్వామిగా బతికేవారు. అదేస్థాయిలో వివాహ బంధానికి విలువనిచ్చేవారు. రోజులు మారాయి. ప్రేమ కాస్త వ్యామోహంగా మారింది. నిస్సిగ్గుగా చెప్పాలంటే వాంఛలు తీర్చుకునేపర్యాయపదమై పోయింది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా వెలుగు చూసిన ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. పెళ్లికాని యువతులు... వివాహమై పిల్లలు ఉన్న వారు సైతం మరో వ్యక్తిని ప్రేమించి తమకు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కడం షరామాములై పోయింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ రోజుకొకటి చొప్పున ఈ తరహా పంచాయితీలు నడుస్తూ ఉన్నాయి.
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో జరుగుతున్న హత్యలను పరిశీలిస్తే వాటి వెనుక వివాహేతర సంబంధాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా చెన్నేకొత్తపల్లి మండలంలో ఓ మహిళ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెల 2న కదిరిలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి వెంకటరమణ హత్యకేసులోనూ ఇదే జరిగింది. హతుడి భార్య ఓ అవివాహిత యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. తమ మధ్య అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు ప్రతి కేసు వెనుక వివాహేతర సంబంధం బయటపడుతుండడం గమనార్హం.
వయస్సుతో సంబంధం లేకుండా..
వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీ, పురుషుల మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది. ప్రేమించుకున్నామంటూ పారిపోవడం ఫ్యాషనై పోయింది. వివాహం తర్వాత కొంతమంది మహిళలు పెళ్లికాని యువకులతో వెళ్లిపోతుంటే.. అప్పటికే వివాహమైన వ్యక్తుల బుట్టలో పడి కొంతమంది యువతులు మోసపోతున్నారు. కొన్ని రోజులు ఇతర ప్రాంతాల్లో సహజీవనం సాగించడం, వ్యామోహం తీరిన తర్వాత ఇంటికి చేరుకోవడం జరుగుతోంది.
మిస్సింగ్ కేసులతో సరిపెట్టి..
ప్రేమ వ్యవహారంతో పారిపోయిన జంటలకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లలో మిస్సింగ్ కేసుల కింద కుటుంబసభ్యులు నమోదు చేయిస్తున్నారు. తమ ఇంటిలోని వ్యక్తి పరాయి మనిషితో కలిసి పారిపోయినట్లు ఇతరులకు తెలిస్తే పరువు పోతుందని భావించిన కుటుంబ సభ్యులు.. మిస్సింగ్ కింద కేసులు నమోదు చేయిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న వారిని తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పంచాయితీతో కేసును మూయించేస్తున్నారు. సమాజంలో ఎంతో పరువుతో బతుకుతున్న కుటుంబసభ్యులు ఈ తరహా ఘటనలతో బజారున పడుతున్నారు. అవమానభారం తట్టుకోలేక మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల గుత్తిలో తమ కుమార్తె ఇష్టంలేని పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించిన తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం చోటు చేసుకుంటున్నాయి.
గత నెలలోవివాహేతర సంబంధాలనేరాల్లో కొన్ని...
♦ 1న గుత్తి కోటలో తెలంగాణకు చెందిన సుమంత్ అనే యువకుడిని హత్య చేశారు. గద్వాల్ జిల్లాకు చెందిన సుమంత్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇది యువతి బంధువులకు నచ్చక పోవడంతో నమ్మించి ఇక్కడకు పిలుచుకొచిచ హతమార్చి వెళ్లిపోయారు.
♦ 12న కదిరిలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి వెంకటరమణ హత్యకేసును పోలీసులు ఛేదించారు. హతుడి భార్య.. ఓ పెళ్లికాని యువకుడితో ప్రేమాయణంలో పడి ఇద్దరూ కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.
♦ 13న ఉరవకొండ మండలం నెరిమెట్లలో వివాహిత సునీత దారుణహత్యకు గురైంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం పెంచుకున్న భర్తే... గొడ్డలితో ఆమెను నరికి చంపినట్లు హతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
♦ 27న ముదిగుబ్బ మండలం బీడిమర్రి కొట్టాలలో తన భార్య విజయలక్ష్మి మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త చంద్రశేఖరే ఆమెను హతమార్చాడు.
నైతిక విలువలు మరిచారు
నైతిక విలువలను విస్మరించి కొందరు తప్పుదారిలో వెళ్తున్నారు. ఇందుకు దంపతుల మధ్య సఖ్యత లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. పెళ్లికి ముందే ఊహాజనికంగా భర్త/భార్య ఇలా ఉండాలని అంచనాలు వేసుకుంటున్నారు. రాంగ్‌కాల్స్‌తో పాటు పాత పరిచయాలు చెడు వ్యాపకాలకు దారి తీస్తున్నాయి. భార్యాభర్తలు నమ్మకంగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే ఇద్దరూ కూర్చొని చర్చించుకోవడం ద్వారా పరిష్కరించుకోవాలి. కేరళలో పెళ్లికి ముందే యువతీ యువకులకు ప్రీ కౌన్సెలింగ్ ఇస్తారు.. అలా ఇక్కడా తల్లిదండ్రులు కూడా పిల్లలకు పెళ్లికి ముందే కౌన్సెలింగ్ ఇవ్వాలి. దీని ద్వారా బాంధవ్యాలు మరింత బలపడుతాయి. భార్యాభర్తల సమస్యల్లో తల్లిదండ్రులు జోక్యం ఉండకూడదు.– డాక్టర్ యండ్లూరి ప్రభాకర్, సైకాలిజిస్ట్
చట్ట ప్రకారం చర్యలు
జిల్లాలో ఇటీవల మిస్సింగ్ కేసులు ఎక్కువయ్యాయి. వివిధ కారణాలతో మహిళలు, యువతులు ఇంటి నుంచి పారిపోతున్నారు. ఆరా తీస్తే ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు వెలుగుచూస్తున్నాయి. ఇది దురదృష్టకరం. ఇంటర్నెట్ ప్రభావం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి కేసుల విషయంలో చట్ట రీత్యా చర్యలు తీసుకుంటున్నాం.– జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment