అరెస్ట్ వివరాలను వెల్లడిస్తున్న సీఐ గోరంట్ల మాధవ్
కదిరి: ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగి అనుమానాస్పద మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్య, ఆమె ప్రియుడు కలిసి పథకం ప్రకారం చేసిన హత్యగా తేల్చారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇందుకు సంబందించిన వివరాలను పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కదిరి పట్టణంలోని వాసవీ నగర్ చెందిన వెంకటరమణ కదిరి ఆర్టీసీ డిపో క్లర్క్‌గా పనిచేస్తూ 2017లో ఉద్యోగ విరమణ చెందాడు. ఈయన తన భార్య రామాంజనమ్మతో కలిసి ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళుతుండేవాడు. అక్కడ ఈమెకు పట్టణంలోని బాలాజీ స్ట్రీట్‌కు చెందిన రామాంజనేయులు అనే పెళ్లి కాని యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది చివరకు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది.
హత్య కుట్ర ఇలా..
ఇటీవల ప్రియుడు కొంత డబ్బు అవసరమైతే ఆమెను అడిగాడు. డబ్బు ఇవ్వడానికి తన భర్త ఒప్పుకోడని ఆమె చెప్పింది. చివరకు ఇద్దరూ కలిసి వెంకటరమణను చంపేస్తే వివాహేతర సంబంధానికి అడ్డూ తొలగిపోతుంది, డబ్బుకూ ఇబ్బందులు ఉండవని భావించి కుట్రపన్నారు. సైనైడ్‌తో క్షణాల్లో చంపేయవచ్చని ప్రియుడు చెప్పడంతో రామాంజినమ్మ సరేనంది. ప్రియుడు రామాంజనేయులు గతంలో అనంతపురంలో పనిచేసే బంగారు వ్యాపారి మహేష్ దగ్గర తాను కూడా కొత్తగా నగల వ్యాపారం ప్రారంభిస్తున్నానని అబద్ధం చెప్పి ఒక కిలో సైనైడ్ తీసుకొచ్చాడు. ఈ నెల ఆరో తేదీన రామాంజనేయులు తన పుట్టిన రోజు ఉందంటూ మధ్యాహ్నం భోజనానికి రావాలంటూ తన ప్రియురాలితో పాటు ఆమె భర్తను కూడా ఇంటికి ఆహ్వానించాడు.
బాబా ప్రసాదం పేరుతో మట్టుబెట్టేశారు
వెంకటరమణకు ఇష్టం లేకపోయినా భార్య వెళ్దామని బలవంతపెట్టడంతో రామాంజనేయులు పుట్టినరోజు వేడుకలకు అతని ఇంటికి వెళ్లక తప్పలేదు. వెళ్లగానే మొదట అతనికి ‘ఇదిగో బాబా ప్రసాదం’ అంటూ సైనైడ్ కలిపిన విభూది ఇచ్చాడు. కళ్లకద్దుకొని అతను మింగిన కొద్ది క్షణాల్లోనే అక్కడే కుప్పకూలాడు. తన భర్తకు గుండెపోటు వచ్చిందంటూ ఏడుస్తున్నట్లు నటిస్తూ వెంటనే ప్రియుడితో కలిసి భర్తను శంకర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి విషం కలిసిన విభూది తిన్నాడని, వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లండని చెప్పడంతో అక్కడికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి చనిపోయాడని ధ్రువీకరించారు.
వైద్యులపై నెపం నెట్టి.. ఆందోళన
భర్తకు సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే తన భర్త చనిపోయాడని రామాంజినమ్మ వైద్యులపై ఆరోపణలు చేస్తూ ఆస్పత్రి ఎదుట కాలనీవాసులతో కలిసి రాస్తారోకో చేసింది. ఆ రోజు పట్టణ పోలీసులు వారికి నచ్చజెప్పి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు.
నిందితులను పట్టించిన సెల్‌నంబర్లు
డీఎస్పీ శ్రీలక్ష్మీ ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని పట్టణ సీఐ గోరంట్ల మాధవ్‌కు విచారణ బాధ్యతలు అప్పగించారు. సీఐ తమ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేయగా... నిందితుల సెల్ నంబర్ల ఆధారంగా అసలు విషయం బయటపడింది. వారిరువురినీ సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో తనతో పాటు పట్టణ ఎస్‌ఐలు హేమంత్‌కుమార్, సహదేవరెడ్డి, క్రైం పార్టీతో పాటు సిబ్బంది పాల్గొన్నారని సీఐ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment