ఓటీపీ తప్పనిసరి.. | Cyber Crime police Arrest Online Cheater From Delhi | Sakshi
Sakshi News home page

ఓటీపీ తప్పనిసరి..

Published Thu, Mar 22 2018 8:38 AM | Last Updated on Thu, Mar 22 2018 8:38 AM

Cyber Crime police Arrest Online Cheater From Delhi - Sakshi

తుషార్‌ ఆరోరా

సాక్షి, సిటీబ్యూరో: సైబర్‌ నేరగాళ్లు నిరుద్యోగులను కొత్త పంథాలో మోసం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్స్‌లో నుంచి సేకరించిన నిరుద్యోగుల బయోడేటాలో ఉన్న ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసి మల్టీ నేషనల్‌ కంపెనీల్లో  ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మిస్తున్నారు. ఇలా రూ.100 ఫీజుతో తాము క్రియేట్‌ చేసిన ఫిషింగ్‌ వెబ్‌సైట్‌లలో బ్యాంక్‌ ఖాతా, డెబిట్‌ కార్డుతో పాటు, సెల్‌ఫోన్‌కు వచ్చిన వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ కూడా నింపాలన్న నిబంధన విధించి,  లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఇలా ఢిల్లీ కేంద్రంగా ఇంటర్‌ మధ్యలోనే చదువు ఆపేసిన  ఎంతో మందిని మోసగిస్తున్న తుషార్‌ ఆరోరాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు  బుధవారం నగరానికి తీసుకొచ్చారు. గ్రాడ్యుయేషన్‌ చేసిన తన కుమారుడు అబ్దుల్‌ ముజామిల్‌ ఇర్ఫాన్‌ సైబర్‌ నేరగాళ్ల చేతిలో రూ.1,24,999లకు మోసపోయాడంటూ  అతడి తండ్రి అబ్దుల్‌ నబీ  సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ వి.శివకుమార్‌ టెక్నికల్‌ డేటా ఆధారంగా ఢిల్లీలో నిందితుడిని పట్టుకున్నారు. క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఐడీఏ బొల్లారంకు చెందిన అబ్దుల్‌ నబీ కుమారుడు, అబ్దుల్‌ ముజామిల్‌ ఇర్ఫాన్‌ ఉద్యోగన్వేషణలో భాగంగా ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్స్‌లో రెస్యూమ్‌ అప్‌లోడ్‌ చేశాడు. జనవరి 17న ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ ఉద్యోగినంటూ ముజామిల్‌కు ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి ఉద్యోగం కావాలంటే ఆన్‌లైన్‌ఫామ్‌.కామ్‌.ఇన్‌లో రిజిష్టర్‌ చేసుకోవాలంటూ సూచించాడు. ఆ వెబ్‌సైట్‌లో ఉన్న అన్ని వివరాలు నమోదు చేస్తూనే అందులో పేర్కొన్నట్టుగా బ్యాంక్‌ వివరాలు, డెబిట్‌ కార్డుతో తన సెల్‌ఫోన్‌కు వచ్చిన వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ కూడా పూర్తిచేశాడు. ఆ తర్వాత మూడు దఫాలుగా రూ. 1,24,999 వివిధ వ్యాలెట్లకు డబ్బులు బదిలీ, డ్రా చేసినట్టుగా ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. దీంతో అతను తనకు ఫోన్‌ చేసినా వ్యక్తికి ఫోన్‌ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో మోసపోయానని తెలుసుకొని తండ్రితో కలిసి సైబరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు. టెక్నికల్‌ డేటా ఆధారంగా  నిందితుడు  తుషార్‌ ఆరోరాను ఢిల్లీలోని మహవీర్‌ ఎంక్లేవ్‌లో అరెస్టు చేశారు.  

ఇంటర్‌ మధ్యలోనే ఆపేసి...
 ఇంటర్మీడియట్‌ మధ్యలోనే చదువుకు స్వస్తి పలికిన తుషార్‌ ఆరోరా దావన్‌ సేల్స్‌ కార్పొరేషన్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఓ ట్రావెల్స్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేశాడు. అదే సమయంలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో టెలీకాలర్‌గా పనిచేస్తున్న తన సోదరుడు హిమాన్షు ఆరోరా నుంచి టెలీకాలర్‌ నైపుణ్యాలు తెలుసుకొని ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో అతడితో కలిసి 2015లో ఐటీ టెక్నాలజీ కంపెనీ ప్రారంభించాడు.  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామనే ఆశతో లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నాడు. దాదాపు 25 నుంచి 30 మంది టెలీకాలర్లను నియమించుకొని ఆన్‌లైన్‌ జాబ్‌పొర్టల్స్‌ నుంచి నిరుద్యోగుల రెస్యూమ్‌లు సేకరించి మల్టీ నేషనల్‌ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్, క్వికర్, హెచ్‌డీఎఫ్‌సీలలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించేవారు.

రూ.100  ఫీజు చెల్లించి తాము క్రియేట్‌ చేసిన ఫిషింగ్‌ వెబ్‌సైట్‌లకు వెళ్లి అందులో ఉన్న వివరాలను పొందుపరచాలని సూచించేవారు. ఈ క్రమంలోనే అందులో పేర్కొన్నట్టుగా  బ్యాంక్‌ వివరాలు, డెబిట్‌ కార్డుతో వారి సెల్‌ఫోన్‌లకు వచ్చిన వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ నిక్షిప్తం చేయడంతో ఖాతాల్లో ఉన్న నగదును తమ వ్యాలెట్‌లకు మళ్లించుకునేవారు. కమీషన్‌ ఎరగా వేసి నిరుపేదల పేర్లపై బ్యాంక్‌ ఖాతాలు తెరిచి ఈ నేరాలకు ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2017లో తుషార్‌ ఆరోరా సోదరుడు, హిమాన్షు ఆరోరాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి పోలీసు నిఘా ఉండటంతో తుషార్‌ ఆరోరా కొంతమంది టెలీకాలర్లు రాంబాబ్‌ ఆరోరా, ప్రిన్స్, శోభా యాదవ్, మమతలతో అదే పంథాను అనుసరించాడు. టెక్నికల్‌ డాటా ఆధారంగా ఢిల్లీలోని మహవీర్‌ ఎంక్లేవ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు సెల్‌ఫోన్లు, ట్యాబ్, ఐ–10 హ్యుందాయ్‌ కారు, 24 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకొని బుధవారం నగరానికి తీసుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement