
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రభుత్వ రంగ సంస్థ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన కొందరు సైబర్ నేరగాళ్లు.. భారీ నియామక ప్రకటన జారీ చేసి నిరుద్యోగులను బురిడీ కొట్టించేందుకు యత్నించారు. తెలంగాణ ఆగ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్ సృష్టించి.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రకటనను తలదన్నే రీతిలో 4,027 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తరహాలోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు, వయో పరిమితి సడలింపులను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు సైతం ప్రకటించారు.
ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణను సైతం ప్రారంభించిన ఈ వెబ్‌సైట్ దరఖాస్తుదారుల వ్యక్తిగత, విద్యార్హతల వివరాల సేకరణతో పాటు పరీక్షల ఫీజు పేరుతో ఆన్‌లైన్ చెల్లింపుల విధానం ద్వారా రూ.98లను వసూలు చేస్తోంది. ఇది రాష్ట్ర ఐటీ శాఖ దృష్టికి రావడంతో అధికారులు పరిశీలించి నకిలీ వెబ్‌సైట్‌గా నిర్ధారించారు. ఆ శాఖ ఫిర్యాదుతో సైబర్ సెక్యూరిటీ విభాగం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై స్పందించిన తెలంగాణ ఆగ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. తాము ఎలాంటి నియామకాలు జరపడం లేదని, నిరుద్యోగులు మోసపోరాదని ప్రకటించింది.