
బాధితుడు మహబూబ్ బాషా
నెల్లూరు, ఉదయగిరి: ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి నగదు మాయం చేసిన ఘటన బుధవారం ఉదయగిరిలో వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం మేరకు.. స్థానిక దిలార్‌భాయ్ వీధికి చెందిన షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి స్వీట్ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ ఫోన్‌పే యాప్ గడువు తీరిందని, వివరాలు తెలిపితే తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పాడు. ఏటీఎం కార్డు, పిన్ నంబర్ చెబితేనే ఫోన్‌పే పనిచేస్తుందని నమ్మబలికాడు. దీంతో మహబూబ్ బాషా తనకు ఆ నంబర్లన్నీ తెలియవని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఆ వ్యక్తి మహబూబ్ బాషా సెల్‌ఫోన్‌కు ఒక లింక్ పంపి ఫోన్ చేశాడు. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ ఫోన్‌పే పునరుద్ధరణ జరుగుతుందని వివరించాడు. దీంతో మహబూబ్ లింక్ ఓపెన్ చేశాడు. ఈక్రమంలో ఖాతాలోని నగదును ఆన్‌లైన్ ద్వారా డ్రా చేశారని చెబుతున్నాడు. బుధవారం బంధువులకు నగదు పంపేందుకు తన ఫోన్‌పే ద్వారా బ్యాలెన్స్ పరిశీలించుకోగా రూ.1,03,900 ఉండాల్సి ఉండగా కేవలం 36 పైసలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. దీంతో సదరు వ్యక్తి నగదు మాయం చేశాడని గుర్తించిన మహబూబ్ వెంటనే స్థానిక సిండికేట్ బ్యాంక్‌కు వెళ్లి అక్కడి అధికారులకు తెలిపాడు. వారి సూచన మేరకు ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.