టార్గెట్‌ ‘ఆర్మీ’ ! | Cyber Criminals Target Army Officials in Hyderabad | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ ‘ఆర్మీ’ !

Published Fri, May 15 2020 7:59 AM | Last Updated on Fri, May 15 2020 7:59 AM

Cyber Criminals Target Army Officials in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరాదికి చెందిన సైబర్‌ నేరగాళ్ళు నగరానికి చెందిన ఆర్మీ అధికారులు, సిబ్బందిని టార్గెట్‌గా చేసుకున్నారు. వీరి చేతిలో మోసపోయిన ముగ్గురు ఆర్మీ సంబంధీకులు గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్‌లో పని చేస్తున్న ఓ ఆర్మీ అధికారి ఇటీవల జియో ఫోన్‌కు ఆన్‌లైన్‌లో రీ–చార్జ్‌ చేసుకున్నారు. అయితే ఆ మొత్తం తన నెంబర్‌కు చేరకపోవడంతో సహాయం కోసం ప్రయత్నించారు. గూగుల్‌లో సెర్చ్‌ చేసిన ఆయన అందులో జియో కాల్‌ సెంటర్‌ పేరుతో కనిపించిన నెంబర్‌కు కాల్‌ చేశారు. ఆ సంస్థ ప్రతినిధులుగా స్పందించిన సైబర్‌ నేరగాళ్ళు విషయం మొత్తం విన్నారు. తాము పంపే లింకు ఓపెన్‌ చేసి, అందులో కోరిన వివరాలు నింపాలని ఆ వెంటనే మీ మొత్తం తిరిగి వచ్చేస్తుందని నమ్మబలికారు. సైబర్‌ నేరగాళ్ళ నుంచి వచ్చిన లింకును ఓపెన్‌ చేసిన ఈయన అందులో కోరిన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఓటీపీని పొందుపరిచారు. వీటి ఆధారంగా సైబర్‌ నేరగాళ్ళు ఆయన ఖాతా నుంచి రూ.42 వేలు కాజేశారు.

మరో ఉదంతంలో తిరుమలగిరిలోని ఆర్మీ కార్యాలయంలో పని చేసే ఓ జవాన్‌కు ఇటీవల జమ్మూ కాశ్మీర్‌కు బదిలీ అయింది. ద్విచక్ర వాహనం లేని ఈయన అక్కడకు వెళ్లేలోపే ఒకటి ఖరీదు చేయాలని భావించారు. దానికోసం ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్‌ చేశారు. అందులో ఆర్మీ అధికారి మాదిరిగా, యాక్టివా 5 జీ వాహనం విక్రయం పేరుతో ఉన్న ప్రకటనకు స్పందించారు. బేరసారాల తర్వాత రూ.23 వేలకు వాహనం ఖరీదు చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఆర్మీ అధికారిగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడు ఆర్మీ ట్రాన్స్‌పోర్ట్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని చెప్పడంతో నగరంలో ఉంటున్న జవాన్‌ నమ్మేశాడు. ఆ మొత్తం ఆన్‌లైన్‌లో బదిలీ చేయగా... మరికొన్ని చార్జీల పేరు చెప్పి మొత్తం రూ.1.3 లక్షలు తమ ఖాతాల్లో వేయించుకున్నారు.

సైబర్‌ నేరగాళ్ళు ప్రతి సందర్భంలోనూ వాహనం ఖరీదు మినహా మిగిలిన అన్ని చార్జీలకు చెందిన నగదు రిఫండ్‌ వస్తుందని చెప్పడంతో బాధితుడు చెల్లిస్తూ పోయాడు. మూడో ఉదంతంలో సికింద్రాబాద్‌లోని మిలటరీ విభాగంలో పని చేసే మరో జవాన్‌ టార్గెట్‌గా మారారు. ఈయన స్నేహితుడికి ఇటీవల మరో ప్రాంతానికి బదిలీ అయింది. ఆయన వెళ్తూ తన ఇన్వర్టర్‌ను అమ్మి పెట్టాలంటూ నగరంలో ఉంటున్న జవాన్‌కు ఇచ్చి వెళ్లారు. దాన్ని విక్రయించడానికి ఈయన ఓఎల్‌ఎక్స్‌ను ఆశ్రయించారు. ఈ ప్రకటన చూశామని, తమకు నచ్చిందని చెప్తూ సైబర్‌ నేరగాళ్ళు కాల్‌ చేశారు. సదరు ఇన్వర్టర్‌ ఖరీదు చేస్తున్నామంటూ చెప్పి క్యూఆర్‌ కోడ్స్‌ పంపారు. వీటిని బాధితుడు స్కాన్‌ చేయడంతో రూ.44 వేలు నేరగాళ్ళ ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. ఈ ముగ్గురూ గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు ఓటీపీ, తదితర ఫ్రాడ్స్‌తో నగదు కోల్పోయిన బాధితులు సైతం సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement