ఫోన్‌ చేసి ఓటీపీ తీసుకుని... | Cyber Criminals Targets Seasonal Crimes in hyderabad | Sakshi
Sakshi News home page

కరెక్షన్‌ పేరుతో కాజేస్తారు..!

Published Tue, Sep 24 2019 1:30 PM | Last Updated on Tue, Sep 24 2019 1:30 PM

Cyber Criminals Targets Seasonal Crimes in hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్‌ పెట్టుబడిగా ఆన్‌లైన్‌లో అందినకాడికి దండుకునే సైబర్‌ నేరగాళ్లు నానాటికి తెలివి మీరుతున్నారు. ఈ క్రిమినల్స్‌ ఇటీవలి కాలంలో ‘సీజనల్‌ ఫ్రాడ్స్‌’ మొదలెట్టారు. వీరు సాధారణంగా ప్రముఖ కంపెనీల పేర్లతో లాటరీలంటూ పుట్టి ముంచుతుంటారు. వరల్డ్‌ కప్, ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో వాటి పేర్లు చెప్పి ‘వర్తమానం’ పంపిస్తారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) రిటరన్స్‌ సమర్నించే సమయం కావడంతో ఆ పేరు చెప్పి మోసాలకు తెరలేపినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఐటీశాఖ పేరుతో ఫిషింగ్‌ మెయిల్స్‌ పంపిస్తూ బోగస్‌ వెబ్‌సైట్స్‌ ద్వారా కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు. 

బ్యాంకు ఖాతా సరిచూసుకోవాలంటూ...
ఐటీ రిటర్న్స్‌ గడువు లోపు ఫైల్‌ చేసిన వారికి ప్రస్తుతం తమకు రావాల్సిన నగదు ఐటీ విభాగం నుంచి వచ్చే సమయం కావడంతో దాన్నీ సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ర్యాండమ్‌గా కొన్ని నంబర్లను ఎంపిక చేసుకుని బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు పంపిస్తున్నారు. స్థానిక భాషల్లోనూ ఉంటున్న ఆ సందేశాల్లో ఈ–ఫైలింగ్‌ ద్వారా పంపిన రిటర్న్‌ను అందుకున్నామని, ఖరారైందని చెబుతూ తమ నుంచి రావాల్సిన మొత్తం ఇంత అంటూ సూచిస్తున్నారు. ఆ నగదును మీకు సంబంధించిన బ్యాంకు ఖాతాకు పంపిస్తున్నామంటూ అక్కడ తప్పు ఖాతా నంబర్‌ చూపిస్తున్నారు. సదరు బ్యాంకు ఖాతా మీది కాకున్నా... అప్‌డేట్‌ చేయాలన్నా ఈ కింది లింకులోకి వెళ్ళాలంటూ దాన్ని పొందుపరుస్తున్నారు. ఈ ఎస్సెమ్మెస్‌లు అందుకున్న వారిలో రిటర్న్‌ రావాల్సిన వారు లేకపోతే పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. రావాల్సిన వారు ఉంటే ఆ ఎస్సెమ్మెస్‌లో ఉన్న బ్యాంకు ఖాతా తమది కాదని భావించి లింకులోకి వెళ్ళి సైబర్‌ నేరగాళ్ళకు చెందిన బోగస్‌ ఐటీ వెబ్‌సైట్‌లో అసలు బ్యాంకు ఖాతా వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. 

ఫోన్‌ చేసి ఓటీపీ తీసుకుని...
ఇలా బోగస్‌ వెబ్‌సైట్స్‌ ద్వారా నెట్‌ బ్యాకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సదరు సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. వీటిని వినియోగించి లావాదేవీలు చేయాలంటే వారికి కావాల్సిందల్లా వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) మాత్రమే. దీన్ని సంగ్రహించడానికి సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారు. తప్పుడు వివరాలతో తీసుకునే సిమ్‌కార్డులతో కాల్స్‌ చేసే క్రిమినల్స్‌ ఆ నంబర్లను ముందే ‘ట్రూకాలర్‌’లో ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌’, ‘ఐటీ ఆఫీస్‌ ల్యాండ్‌లైన్‌’, ‘ఐటీ అసిస్టెంట్‌ కమిషనర్‌’ తదితర పేర్లతో సేవ్‌ చేస్తున్నారు. దీంతో ఈ కాల్స్‌ అందుకునే వారు ట్రూకాలర్‌ ద్వారా ఈ పేర్లను చూస్తే ఐటీ శాఖ నుంచి ఫోన్‌ వస్తున్నట్లు భావిస్తారు. అప్పటికే బోగస్‌ వెబ్‌సైట్‌ ద్వారా తమకు చేరిన వివరాలు చెప్పి మరింత నమ్మకం కలిగించే నేరగాళ్ళు కరెక్షన్‌ పూర్తయిందని, మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలంటూ అడిగి తీసుకుంటుంటారు. ఇలా అన్ని వివరాలు చేరిన తర్వాత ఆన్‌లైన్‌లో ఖాతాలు ఖాళీ చేస్తుంటారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వెలుగులోకి వస్తున్న బోగస్‌ వెబ్‌సైట్స్‌ను బ్లాక్‌ చేసినప్పటికీ నేరగాళ్ళు మరికొన్ని మార్పులతో మరొటి సృష్టించి ఫిషింగ్‌ చేస్తున్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి మెయిల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం నెట్‌ బ్యాకింగ్‌ సహా వ్యక్తిగత సమాచారం పొందుపరచాలని అందులో ఉన్నా అనుమానించి అధికారులను ఆశ్రయించి సందేహం నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.  

రిటర్న్స్‌లో తప్పులు ఉన్నాయంటూ...
ఐటీ రిటర్న్స్‌లో పొరపాట్లు దొర్లినా, సరైన సమయంలో ఆ విభాగానికి చేరకపోయినా పాన్‌ హోల్డర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనిని ఆసరాగా తీసుకున్న సైబర్‌ నేరగాళ్లు ఐటీ శాఖ వెబ్‌సైట్‌ను పోలిన దాన్నే తయారు చేస్తున్నారు. అసలు వెబ్‌సైట్‌ (donotreply@incometaxindiaefiling.gov.in ) చిరునామాతో ఉంటుంది. అయితే నేరగాళ్లు గుర్తించడానికి వీలులేని కొన్ని చిన్న చిన్న మార్పులతో దీనినే పోలి ఉండేలా సైట్స్‌ రూపొందిస్తున్నారు.గతేడాది సైబర్‌క్రైమ్‌అధికారులు గుర్తించిన దాని ప్రకారం సైబర్‌నేరగాళ్ళు తయారు చేసిన బోగస్‌ వెబ్‌సైట్‌ (donotreply@incometaxindiafilling.gov.in) చిరునామాతో ఉంటోంది. ఈ–ఫైలింగ్‌ అనే పదంలో ‘ఇ’ అక్షరం లేకుండా (filing),  ఫిల్లింగ్‌ అనే పదాన్ని (filling)గా పేర్కొంటూ ఈ సైట్‌ రూపొందిస్తున్నారు. ఈ లింకును పంపిస్తున్న సైబర్‌ నేరగాళ్లు తక్షణం మళ్లీ రిటర్న్స్‌ దాఖలు చేయాలని గతంలో చేసిన ఈ–ఫైలింగ్‌లో తప్పులు ఉన్నాయని చెబుతూ మళ్లీ దాఖలు చేయకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరిస్తుంటారు. వీటిని నమ్మిన ఎవరైనా ఆ లింకులోని ప్రవేశిస్తే అది నేరుగా సైబర్‌ నేరగాళ్లకు చెందిన సర్వర్‌కు చేరుతుంది. ఆ లింకు ద్వారా ఓపెన్‌ అయ్యే పేజ్‌ పాన్‌ వివరాలతో పాటు నెట్‌ బ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలనూ పొందుపరచాలని కోరుతుంది. ఈ బోగస్‌ వెబ్‌సైట్‌ సైతం అసలు దాన్నేపోలి ఉండటంతో పలువురు నిజమేనని నమ్మివాటిని పూరించేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement