సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నివసించే ఓ ఉద్యోగికి బ్యాంకు అధికారుల మాదిరిగా కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.లక్ష స్వాహా చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఝార్ఖండ్‌లోని జమ్‌తార వరకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక ఆ సిమ్ ఒక బిచ్చగాడిదని, ఈ నేరంతో అతడికి ఎలాంటి సంబంధం లేదని తెలిసి కంగుతిన్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో సిమ్ కార్డుల కోసం ఈ పంథా అనుసరిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. వీరు ఒక్కో నేరానికి ఒక్కో సిమ్‌కార్డు, సెల్‌ఫోన్ వాడుతూ ‘పని’ పూర్తి కాగానే వాటిని ధ్వంసం చేస్తున్నారని వివరిస్తున్నారు.
నేరగాళ్ల అడ్డా.. జమ్‌తార
పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోస్ జిల్లా దాటి ఝార్ఖండ్‌లోకి ప్రవేశించగానే వచ్చేది జమ్‌తార జిల్లా. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. పూర్తి స్థాయిలో విద్యుదీకరణ సైతం జరగని ఆ జిల్లా కేంద్రంలో జనరేటర్లకు మంచి డిమాండ్ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీటి సాయంతో ల్యాప్‌టాప్స్, సెల్‌ఫోన్లను వినియోగించే యువత దేశవ్యాప్తంగా అనేక మందికి కాల్స్ చేసి కార్డుల వివరాలు సహా ఓటీపీల కోసం గాలం వేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పని చేసిన వచ్చిన జమ్‌తార యువత... ప్రస్తుతం సొంతంగా నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని ఈ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. జమ్‌తారలో ఉన్న కొందరు కీలక వ్యక్తులు ఫోన్లలో ఎదుటి వారితో మాట్లాడడం ఎలా? అనే అంశంపై తమ యువతకు శిక్షణ కూడా ఇస్తుంటారని పోలీసులు పేర్కొంటున్నారు.
రూటు మార్చి...
కేవలం ఫోన్ల ఆధారంగా ఈ నేరాలు చేసే వారికి సిమ్‌కార్డుల అవసరం ఎంతో ఉంటుంది. అలాగని తమ పేర్లు, చిరునామాలతో తీసుకుంటే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు దర్యాప్తులో చిక్కే ప్రమాదం ఉంటుందన్నది వారి భావన. దీంతో సిమ్‌కార్డుల కోసం ఈ సైబర్ నేరగాళ్లు గతంలో నకిలీ పేర్లు, బోగస్ చిరునామాలను వినియోగించేవాళ్లు. అయితే కొన్నాళ్లుగా సిమ్‌కార్డుల జారీ నిబంధనలు కఠినతరమయ్యాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించిన జమ్‌తార నేరగాళ్లు... బిచ్చగాళ్లు, అడ్డా కూలీలపై దృష్టిసారించారు. జమ్‌తారతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వారిని సంప్రదిస్తూ వారికి అసలు విషయం చెప్పట్లేదు. కేవలం తమకు తక్షణం సిమ్‌కార్డు అవసరం ఉందంటూ రూ.200 నుంచి రూ.500 వరకు వారికి చెల్లించి, వాళ్ల పేరు మీద సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. ఆపై తమ ప్రాంతానికి చేరుకొని కాల్స్ చేసి ఎదుటి వారిని నిండా
ముంచుతున్నారు.
డేటా ఎలా వస్తోంది?
ఈ సైబర్ నేరగాళ్లకు ఆయా బ్యాంకు వినియోగదారులకు చెందిన డేటా ఎక్కడి నుంచి అందుతోందనేది ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టంగా తెలియట్లేదని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. బ్యాంకుల్లో కిందిస్థాయి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పాటు కాల్ సెంటర్లు తదితర మార్గాల్లో డేటా పొందుతున్నారని ప్రాథమికంగా భావిస్తున్నామని చెబుతున్నారు. ఈ డేటా వినియోగించి అప్పటికే సిద్ధంగా ఉన్న సిమ్‌కార్డులను బేసిక్ మోడల్, తక్కువ ఖరీదున్న ఫోన్లలో వేసి వినియోగదారులకు కాల్స్ చేసి ఎర వేస్తున్నారు. ‘ట్రూకాలర్’ యాప్‌లో తాము వినియోగిస్తున్న నంబర్లను బ్యాంక్ హెడ్–ఆఫీస్/బ్యాంక్ మేనేజర్ లేదా ఆయా బ్యాంకు పేర్లతో రిజిస్టర్ చేస్తున్నారు. దీంతో కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులు అవి బ్యాంకు నుంచే వస్తున్నట్లు భ్రమపడి తమ వ్యక్తిగత, కార్డు వివరాలు, ఓటీపీలు చెప్పేస్తున్నారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డును ధ్వంసం చేసేస్తున్నారు.
దర్యాప్తులో సవాళ్లు...
క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన వారికి ఫోన్లు చేసే ఈ నేరగాళ్లు ముందుగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి పేరు, ఏ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి... ఆ బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్‌డేట్ చేయాలనో వారిని నమ్మిస్తారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకొని వినియోగదారుడి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకొని టోకరా వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ డేటా ఆధారంగా క్లోన్డ్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు సైతం తయారు చేసి డ్రా చేసుకుంటున్నారని వెలుగులోకి వచ్చింది. వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలన్నీ తప్పుడు వివరాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. జమ్‌తార ప్రాంతంలో ఒక్కో సెల్‌టవర్ పరిధి కిలోమీటర్ మేర విస్తరించి ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లి సాంకేతికంగా దర్యాప్తు చేయడం సైతం పెను సవాలుగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
గుడ్డిగా నమ్మొద్దు
ఈ తరహా వ్యవహారాలే కాదు ఎలాంటి సైబర్ నేరంలో అయినా మోసపోవడం ఎంత తేలికో... నేరగాళ్లను పట్టుకోవడం అంత కష్టం. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే ఈ తరహా సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఏ బ్యాంకు ఫోన్ చేయదని గుర్తుంచుకోవాలి. పేపర్‌లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకునకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్ ద్వారా రహస్య వివరాలు అడగవు. సైబర్ నేరాలను కొలిక్కి తీసుకురావడానికి, నేరగాళ్లను కట్టడి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి.– సైబర్ క్రైమ్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment