సాక్షి, హైదరాబాద్: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 9న అనుమానాస్పద స్థితిలో ఆయన అదృశ్యమైన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46లోని తన నివాసానికి వచ్చిన ప్రభును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తన అల్లుడు కనిపించడం లేదంటూ అతడి మామ నార్ల సురేంద్ర ప్రసాద్ ఈ నెల12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అదే రోజు సాయంత్రం తారక ప్రభు ఆటోలో ఇమ్లిబన్ బస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ చిత్తూరు బస్సు ఎక్కినట్లుగా సీసీ టీవీల్లో రికార్డైంది. ఎస్‌ఐ చంద్రశేఖర్ మూడు రోజుల పాటు తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ప్రయోజనం కనిపించలేదు.
కాగా ఈ నెల 12న ప్రభు తన పెద్ద భార్య దాసరి సుశీలతో కలిసి హైదరాబాద్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించినప్పటికీ హడావుడిగా తెల్లవారే వెళ్లిపోయారు. బుధవారం పోలీసుల ఎదుట హాజరైన ప్రభు మిస్సింగ్‌కు గల కారణాలను ఆరా తీస్తే సరైన సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. ఓ మహిళ తనను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిందని ఓ సారి చెప్పగా, తాను ఇక్కడి నుంచి ముంబై వెళ్లానంటూ మరోసారి పొంతన లేని సమాధానం చెబుతున్నాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆయన చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన మిస్సింగ్ వెనుక గల కారణాలను ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment