సాక్షి, చెన్నై : సోదరులు నగదు సాయం చేయడాన్ని అడ్డుకోవడంతోనే తండ్రిపై పెట్రోలు పోసి హతమార్చానని మృతుడి కుమార్తె మంగళవారం పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చింది. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టికి చెందిన సుబ్బయ్య (68)ని ఈ నెల 3న తన కుమార్తె మూక్కమ్మాళ్ పెట్రోలు పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. మంటల్లో చిక్కుకున్న అతన్ని స్థానికులు రక్షించి తిరుచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి సుబ్బయ్య మృతిచెందాడు. ఇలా ఉండగా దీనికి కారణమైన ముక్కమ్మాళ్ కోసం నాలాట్టిన్ పుత్తూరు పోలీసులు గాలిస్తూ వచ్చారు. ఎట్టకేలకు మంగళవారం ఆమెను అరెస్టు చేశారు.
పోలీసులకు ముక్కమ్మాళ్ ఇచ్చిన వాంగ్మూలంలో ఇలా చెప్పింది. తనకు ముగ్గురు సోదరులున్నారని, భర్తతో విడిపోయిన తాను తన పిల్లలను బాగా చదివించేందుకు నిర్ణయించానని తెలిపింది. పెద్ద, చిన్న కుమార్తెను ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించానని, వారి చదువు కోసం తాను మిల్లులో పని చేస్తున్నట్లు చెప్పింది. వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులతో పాటు విదేశాల్లో ఉన్న సోదరులను నగదు సాయం కోరినట్లు తెలిపింది. వారు కొంతమేరకు నగదు పంపుతూ వచ్చారని, సోదరులు నగదు పంపడాన్ని తండ్రి అడ్డుకున్నట్లు పేర్కొంది. ఇది తనకు ఆగ్రహం తెప్పించిందన్నారు. దీంతో ఈ నెల 3న తండ్రిపై పెట్రోల్ కుమ్మరించి హతమార్చినట్లు తెలిపింది. పోలీసులు ముక్కామ్మాళ్‌ను కోవిల్‌పట్టి కోర్టులో హాజరుపరిచి నెల్‌లై కొక్కిర కుళం మహిళా జైలులో బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment