
సాక్షి, రంగారెడ్డి : చెడు అలవాట్లు మానుకోవాలని మందలించిన తల్లి పట్ల ఓ కూతురు కర్కశంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చి తల్లీకూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చింది. ఈ ఘటన హయత్‌నగర్‌లోని మునుగనూరులో చోటుచేసుకుంది. వివరాలు... రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాసరెడ్డి బతుకు దెరువు నిమిత్తం భార్య రజిత (38), కూతురు కీర్తితో కలిసి నగరానికి వలసవచ్చాడు. ప్రస్తుతం వీరు మునగనూరులో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరెడ్డి లారీ డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా రజిత ఇంటివద్దే ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ క్రమంలో తమ కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లుగా రజిత గుర్తించింది. ఇది మంచి పద్ధతి కాదంటూ కూతురిని మందలించింది. దీంతో తల్లిపై ద్వేషం పెంచుకున్న కీర్తి.. తండ్రి డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమెను కడతేర్చాలని భావించింది.
ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి పథకం రచించి తల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని అతడితో పాటు అక్కడే మూడురోజుల పాటు గడిపింది. అయితే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎవరికైనా అనుమానం వస్తుందోమోనని భయపడి... ప్రియుడు శశి సహాయంతో తల్లి మృతదేహాన్ని రామన్నపేట సమీపంలోని రైలు పట్టాల మీద పడేసింది. అనంతరం తాను వైజాగ్ టూర్‌కు వెళ్తున్నానని తండ్రికి చెప్పి... ఇంటి వెనుకాలే ఉండే తన మరో ప్రియుడితో కీర్తి గడిపింది.
అంతేకాకుండా తన తల్లి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన తండ్రి తాగి రావడంతో కొన్నిరోజులుగా అమ్మానాన్నల మధ్య గొడవ జరుగుతోందని... ఈ నేపథ్యంలో విచారణ జరపాల్సిందిగా పోలీసులను కోరింది. కాగా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన శ్రీనివాసరెడ్డి.. రజిత గురించి కీర్తిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణలో భాగంగా తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను హతమార్చినట్లు కీర్తి అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment