సాక్షి, న్యూఢిల్లీ: భర్త చేతిలో చిత్రహింసలకు గురైన ఎయిర్‌హోస్టెస్ మృతి దేశరాజధానిలో కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్ వద్ద ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి అనిస్సియా బత్రా(32) అనే ఎయిర్‌హోస్టెస్ ప్రాణాలు విడిచింది. అయితే ఆమె భర్త మయాంక్ సింఘ్వీ, అతని కుటుంబ సభ్యులే ఆమెను చంపేసి ఉంటారని అన్నిసా బంధువులు ఆరోపిస్తున్నారు.
రెండేళ‍్ల క్రితం అనిస్సియాకు మయాంక్‌తో వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా మయాంక్ తప్పతాగి వచ్చి అదనపు కట్నం కోసం ఆమెను హింసిస్తున్నాడు. ఈ వ్యవహారంలో అతని తమ్ముళ్లు కూడా సహకరిస్తున్నారు. దీంతో అనిస్సియా తండ్రి ఆర్‌ఎస్ బత్రా(రిటైర్డ్ ఆర్మీ అధికారి) కొన్నిరోజుల క్రితం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త, మరదులు కొన్నిరోజులుగా ఆమెను టార్చర్ పెడుతున్నారని, ఆమెకేమైనా అయితే వారిదే బాధ్యత అని బత్రా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుకాగా, పోలీసులు ఆమె అత్తమామల్ని, మరుదులను ప్రశ్నించారు కూడా. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఆమె బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
చనిపోయేముందు... చనిపోయేముందు తన సోదరి తనకు ఫోన్ చేసిందని కరన్ బత్రా చెబుతున్నాడు. ‘నాకు ఫోన్ చేసింది. నన్ను గదిలో పెట్టి హింసిస్తున్నారు, పోలీసులకు సమాచారం అందించండని, రక్షించండని ఏడ్చింది. కాసేపటికే బిల్డింగ్ నుంచి దూకేసిందని, ఆస్పత్రిలో చేర్పించామని మయాంక్ ఫోన్ చేశాడు. తీరా ఆస్పత్రికి వెళ్లేసరికి ఆమె శవమై కనిపించింది. ఖచ్ఛితంగా వాళ్లే చంపేసి ఉంటారు’ అని కరణ్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు పోలీసులు సీజ్ చేసిన గదిని స్పేర్ కీ తో మయాంక్ తెరిచి సాక్ష్యాలను తారుమారు చేశాడని కరణ్ తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment