మితిలేశ్ ఫ్యామిలీ ఫొటో (కర్టెసీ : ఏషియన్ ఏజ్)
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తన ‘స్వేచ్ఛ’కు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులు, చెల్లెలిపై కోపం పెంచుకున్న బీటెక్ విద్యార్థి, వారిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా ఈ నేరాన్ని తండ్రిపై నెట్టాలని చూశాడు. చివరికి నేరాన్ని అంగీకరించి కటకటాలపాలయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం... మిథిలేశ్ అనే ఇంటీరియర్ డిజైనర్ భార్యా పిల్లలతో కలిసి దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్నాడు. కొడుకు సూరజ్(19).. గురుగ్రామ్‌లోని ఓ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ మొదటి ఏడాది చదువుతున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడ్డ సూరజ్ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. స్నేహితులతో తిరగొద్దని, వాళ్లను ఇంటికి తీసుకురావద్దని హెచ్చరించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న సూరజ్.. వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా తన మొబైల్ చెక్ చేస్తూ వారికి తన గురించి చాడీలు చెబుతున్న చెల్లెల్ని(16) కూడా అడ్డు తొలగించుకోవాలని భావించాడు. బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన సూరజ్.. బెడ్‌రూంలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు, చెల్లెలిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు.
కట్టుకథ అల్లాడు..
హత్య చేసిన తర్వాత ఇరుగుపొరుగు వారిని పిలిచిన సూరజ్ తన తల్లిదండ్రులు, చెల్లెల్ని దొంగలు చంపేశారని ఏడ్వడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా వారికి అనుమానం రాకుండా తనని తాను కత్తితో గాయపరచుకున్నాడు. ఈ ఘటనతో ఉలికిపడ్డ పక్కింటి వారు సూరజ్‌ను సముదాయించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే సూరజ్ ప్రవర్తనతో అనుమానం కలిగిన పోలీసులు అతడిని పోలీసు స్టేషనుకు పిలిపించారు. విచారణ జరుపుతున్న క్రమంలో హత్యకు కారణం దొంగలు కాదని.. తన తల్లి, చెల్లెలిని కత్తితో పొడిచింది తండ్రేనని.. అందుకే ఆయనను చంపానని సూరజ్ పోలీసులకు చెప్పాడు. కానీ మిథిలేశ్‌కు అలాంటి వాడు కాదని.. భార్యా పిల్లలను ప్రేమగా చూసుకునే వాడని ఇరుగుపొరుగు వారు చెప్పడంతో సూరజ్‌ని మరోసారి లోతుగా విచారించారు. ఈ క్రమంలో కామన్ గేట్ తాళం చెవి ఆధారంగా నిందితుడు సూరజేనని కనిపెట్టగలిగారు.
2013లో కిడ్నాప్ నాటకం...
చిన్ననాటి నుంచే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన సూరజ్‌కు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ సరిపోయేది కాదు. అంతేకాకుండా తమది సంపన్న కుటుంబమైనా తల్లిదండ్రులు తనకి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని 2013లో కిడ్నాప్ నాటకం ఆడాడు. స్నేహితుల దగ్గరే కొన్నాళ్లపాటు ఉన్న సూరజ్ కిడ్నాప్ అయ్యానంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment