న్యూఢిల్లీ : బాలీవుడ్ సినిమా ‘స్పెషల్ చబ్బీస్’ ప్రేరణతో ఐటీ అధికారులుగా నమ్మబలికి. దాదాపు 48 లక్షల రూపాయల డబ్బును దోచుకెళ్లిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంట్లో లెక్కలో చూపించని సొమ్ము పెద్ద మొత్తంలో ఉందని తెలుసుకున్న నలుగురు వ్యక్తులు దాన్ని కాజేయాలని భావించారు. అందుకోసం ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులమని చెప్పి.. నకిలీ గుర్తింపు కార్డులు చూపించి.. ఆ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో దాదాపు రూ.48 లక్షల సొమ్మును సీజ్ చేస్తున్నట్లు చెప్పి దోచుకెళ్లారు.
డబ్బును సీజ్ చేసినట్లు మెమో జారీ చేయడమే కాక.. రెండు రోజుల్లో ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీస్‌కు వచ్చి సరైన ఆధారాలు చూపించి సొమ్ము తీసుకెళ్లాల్సిందిగా తెలిపారు. దాంతో పాటు ఇంటికి సంబందించిన సీసీటీవీ కెమరా రికార్డింగ్స్‌ను కూడా నిందితులు తమతో పాటు తీసుకెళ్లారు. తదుపరి విచారణలో ఈ రికార్డింగ్స్ పనికొస్తాయని తెలిపారు. దాంతో బాధితులు ఇన్‌కమ్‌ట్యాక్స్ కార్యాలయానికి వెళ్లి జరిగింది చెప్పగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ కార్యలయానికి చెందిన అధికారులు ఎవరూ సదరు ప్రాంతంలో ఎలాంటి దాడులు చేయలేదని అధికారులు పేర్కొన్నారు.
మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు పోలీసస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు సదరు ప్రాంతం సీసీటీవీ కెమరా ఫుటేజ్‌ని పరిశీలించగా.. కారులోంచి ఓ నలుగురు వ్యక్తులు దిగడం.. బాధితుల ఇంటికి వెళ్లడం వంటి అంశాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిలో ఇద్దరిని అరెస్ట్ చేసి రూ. 22.45లక్షల సొమ్మును రికవరీ చేసుకున్నారు. మిగతా ఇద్దరి నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment