సాక్షి, న్యూఢిల్లీ : ఐఆర్‌సీటీసీ తప్పుడు మెసేజ్ పంపటంతో దావా వేసిన ఓ ప్యాసింజర్ నష్టపరిహారం వసూలు చేశారు. రైల్వే శాఖను బాధ్యులుగా చేస్తూ ఐఆర్‌సీటీసీ చేసిన వాదనను కొట్టిపారేస్తూ మరీ వినియోగదారుల ఫోరమ్ తీర్పు వెలువరించింది.
మే 29న అలహాబాద్ నుంచి ఢిల్లీ మధ్య నడిచే మహాబోధి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు ఓ సందేశం పంపింది. తమ టికెట్లను రద్దు చేసుకుంటేనే డబ్బు వెనక్కి ఇస్తామంటూ ప్రయాణికులకు అందులో పేర్కొంది. అయితే కాసేపటికే.. పొరపాటున ఆ సందేశం పంపామని క్షమాపణలు తెలియజేస్తూ, నిర్ణీత సమాయానికే రైలు బయలుదేరుతుందని మరో సందేశం పంపింది.
అది గమనించని వైశాలి ప్రాంతానికి చెందిన విజయ్ ప్రతాప్, అతని కొడుకు అక్షత్‌లు రిఫండ్ కోరుతూ టికెట్లు రద్దు చేసుకున్నారు. కానీ, వారికి ఒక టికెట్ డబ్బులు మాత్రమే వెనక్కి రావటంతో దావా వేశారు. ఆరోజు తన కుమారుడు ఢిల్లీకి అత్యవసరంగా వెళ్లాల్సి ఉండటంతో క్యాబ్‌లో పంపించానని.. ఆ డబ్బులతోపాటు ఐఆర్‌సీటీసీ నుంచి న్యాయంగా రావాల్సిన డబ్బును ఇప్పించాలని కోరుతూ విజయ్ ప్రతాప్ స్థానిక వినియోగదారుల ఫోరంలో పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి స్పందించిన ఫోరం ఆయనకు 25,000 పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో రైల్వే శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. తాము రైల్వే శాఖకు కేవలం ఏజెంట్లుగా మాత్రమే వ్యవహరిస్తామని.. పైగా ప్రయాణికుల నుంచి తమకెలాంటి నోటీసులు అందలేదని ఐఆర్‌సీటీసీ వాదించింది. అయితే వాటిని తోసిపుచ్చిన ఫోరమ్ నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment