
ఢిల్లీలోని ఓ బస్సులో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి
సాక్షి, న్యూఢిల్లీ : బస్సులో వెళుతున్నప్పుడు ఓ అమ్మాయిపక్కన కూర్చొని అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పట్టించిన వారికి రూ.25,000 బహుబతిగా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కనీసం ఎవరు సమాచారం అందించినా వారికి రూ.25వేలు ఇస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని డీటీసీ బస్సులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని ఒకరు ప్రయాణిస్తున్నప్పుడు తన పక్కన కూర్చున్న వ్యక్తి అసభ్య చేష్టలకు దిగాడు. ఆమెను తడిమేందుకు కూడా ప్రయత్నించాడు.
ఫిబ్రవరి 7న చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఆమె వీడియోను కూడా రికార్డు చేసింది. ఆ సమయంలో బస్సులో ఏ ఒక్కరూ అతడిని పట్టించుకోలేదు. ఆమెకు సహాయం కూడా చేసేందుకు కూడా ముందుకు రాలేదు. దీంతో ఈ విషయంపై గత సోమవారం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి వసంత విహార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు అతడికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.