సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్‌ఈ పేపర్ల లీకేజీ వ్యవహారం.. తిరిగి పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించటంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు లీక్ వ్యవహారంపై సీబీఎస్‌ఈకి ముందస్తు సమాచారం ఇచ్చిందెవరో కనిపెట్టే పనిలో ఢిల్లీ పోలీసులు తలమునకలైయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా దిగ్గజం గూగుల్‌ను ఆశ్రయించారు.
శుక్రవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ శాఖ గూగుల్‌కు ఓ లేఖ రాసింది. అందులో సీబీఎస్‌ఈకు వచ్చిన సందేశం తాలుకూ జీ మెయిల్ ఐడీ వివరాలను అందించాలని పోలీస్ శాఖ కోరింది. మరోవైపు బోర్డుకు వచ్చిన మరో ఫ్యాక్స్ సందేశంపై కూడా దర్యాప్తు చేపట్టింది. ఇక ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టిన వాట్సాప్ గ్రూపులు, వాటి అడ్మిన్లు.. అందులోని సభ్యులను కూడా విచారణ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే 30 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాళ్ల ఫోన్లు స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు.
మార్చి 23వ తేదీన సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌కు ఓ మెయిల్, ఫ్యాక్స్ వచ్చాయి. అందులో పన్నెండో తరగతి ఎకనామిక్స్ పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. అది జరిగిన కొన్ని రోజులకు పేపర్ నిజంగానే లీక్ కావటంతో బోర్డు ఖంగుతింది. 12వ తరగతి ఎకనామిక్స్, 10వ తరగతి మ్యాథ్స్ రెండు పేపర్లు లీక్ అయ్యాయి. అయితే లీక్ అయిన విషయం పరీక్ష కంటే కొన్ని గంటల ముందు తెలిసినప్పటికీ.. ఎగ్జామ్ రద్దు చేయకుండా గప్ చుప్‌గా పరీక్షలు నిర్వహించి.. ఇప్పుడు మళ్లీ రీ-ఎగ్జామ్ ప్రకటన చేయటంపైనే తీవ్ర దుమారం రేగుతోంది. ఈ మేరకు రాజకీయ పార్టీలు కూడా బోర్డు తీరును తప్పుబడుతున్నారు.
‘ప్రధాని స్పందించరేం?’
సీబీఎస్‌ఈ పేపర్ల లీకేజీ వ్యవహారంలో ప్రధాని ఎందుకు స్పందించటం లేదని కాంగ్రెస్ కపిల్ సిబల్ మండిపడ్డారు. పేపర్ల లీకేజీకి బాధ్యలెవరైనా.. శిక్ష విద్యార్థులకు విధించటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
జవదేకర్‌కు సిసోడియా లేఖ
కేంద్ర మంత్రి జవదేవకర్‌కు ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖా మంత్రులతో చర్చించి రీ ఎగ్జామ్‌పై నిర్ణయం తీసుకోవాలని సిసోడియా లేఖలో కోరారు.
ఒకట్రెండు రోజుల్లో రీ ఎగ్జామ్ తేదీలు
రీ ఎగ్జామ్ తేదీలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన్ని కలిసిన సీబీఎస్‌ఈ విద్యార్థులతో ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment