
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఆర్థిక శాస్త్రం ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పరీక్షకంటే 3 రోజుల ముందే హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో ప్రశ్నపత్రం బయటకొచ్చిందని, తర్వాత కనీసం 40 వాట్సాప్ గ్రూప్‌లకు దీన్ని పంపారని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఉనాలోని డీఏవీ సెంటినరీ పబ్లిక్ స్కూల్‌కు చెందినవారు.
వీరిలో ఒకరు ఆర్థికశాస్త్రం అధ్యాపకుడు కాగా మిగిలిన ఇద్దరు బోధనేతర సిబ్బంది. కంప్యూటర్ సైన్స్ పరీక్ష రోజైన మార్చి 23నే ఉనాలోని యూనియన్ బ్యాంకు స్ట్రాంగ్‌రూమ్ నుంచి నిందితులు ఆర్థిక శాస్త్రం ప్రశ్నపత్రాన్ని బయటకు తీసి ప్రశ్నలను చేతితో రాసి ఆ కాగితాన్ని ఫొటో తీసి వాట్సాప్ గ్రూప్‌లలో పంపించారని పోలీసులు గుర్తించారు.