
పోలీసుల అదుపులో పేపర్ లీకేజీ నిందితులు
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ ఆర్థికశాస్త్రం ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు. వీరిలో రిషబ్(29), రోహిత్(26)లు ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తుంటే.. తౌకీర్(26) ప్రైవేటు కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. ‘పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాన్ని ఉదయం 9.45 గంటలకు బయటకు తీయగానే రిషబ్, రోహిత్‌లు వాటి ఫొటోలు తీసి తౌకీర్‌కు పంపారు.
అతను వాటిని తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు వాట్సప్ ద్వారా చేరవేశాడు. లీకైన ఆర్థికశాస్త్రం పేపర్‌ను అందుకున్న ఓ విద్యార్థితో పాటు సీబీఎస్‌ఈ ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్ నంబర్ల ఆధారంగా తౌకీర్‌ను అదుపులోకి తీసుకున్నాం’ అని కుమార్ తెలిపారు. రిషబ్, రోహిత్, తౌకీర్‌లు గత ఐదేళ్లుగా స్నేహితులనీ, తౌకీర్ ప్రోద్బలంతోనే ఇద్దరు నిందితులు ప్రశ్నపత్రం లీక్‌కు పాల్పడ్డారన్నారు. పేపర్ లీక్‌కు ప్రతిఫలంగా తౌకీర్ వీరిద్దరికీ రూ.2,000 నుంచి రూ.5,000 వరకూ ఇచ్చాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment