
కనక్ గోయల్ (కర్టెసీ : టైమ్స్ ఆఫ్ ఇండియా)
ఢిల్లీకి చెందిన ముఖేశ్ గోయల్ కిరాణా కొట్టు నడుపుతుంటారు. ఆయనకు ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు. కొడుకు మయాంక్(25) తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కూతురు కనక్(21).. ఓవైపు కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తూనే మరోవైపు సీఏ ఇంటర్న్‌షిప్ కోర్సు కూడా చేస్తోంది. అంతేకాదు ఇటీవలే ఎల్ఐసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యింది. ఆ ఆనందంలో తండ్రి ఆమెకు ఇచ్చిన బహుమతి ప్రస్తుతం వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది.
కొత్త ఏడాది తీరని శోకం మిగిల్చింది..
తన దినచర్యలో భాగంగా భాగంగా జనవరి 2న కనక్ ట్యూషన్‌కు బయలుదేరింది. ముకార్బా చౌక్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న కనక్‌ను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు స్థానికులు. విషయం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లే సరికే కనక్ మరణించిందన్న విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు.
‘హంతకుడి’ జాడ తెలియలేదు
హిట్ అండ్ రన్ కేసుగా నమోదైన కనక్ డెత్ కేసులో నిందితులెవరూ పోలీసులు ఇంతవరకూ కనిపెట్టలేదు. సీసీటీవీ ఫుటేజీల్లో సదరు వాహనానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, ప్రమాదం జరిగిన చోట జన సమ్మర్ధం ఎక్కువగా ఉండటంతో కూడా ఈ కేసులో కాస్త జాప్యం జరుగుతుందంటూ పోలీసులు చెప్పడంతో కనక్ అన్నయ్య రంగంలోకి దిగాడు.
నా చెల్లెలి హంతకులెవరో తెలియాలి అంతే..
‘ట్యూషన్లతో మొదలైన కనక్ దినచర్య ఇంటర్న్‌షిప్‌తో ముగుస్తుంది. ఎల్‌ఐసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత సెప్టెంబరులో నాన్న తనకు స్కూటీ కొనిచ్చాడు. సమయానికి ఇంటికి చేరుకోవడంతో పాటు తనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయని భావించారు. కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయింది. తను మాకు శాశ్వతంగా దూరమైంది. అయితే నా చెల్లెలి చావుకు కారణమైన వాళ్లెవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే కనక్, స్కూటీ ఫొటోలతో కూడిన పాంప్లెంట్స్ పంచడంతో పాటుగా పోలీసుల అనుమతి తీసుకుని బారికేడ్లు కూడా ఏర్పాటు చేశాను.
అయితే ఒక్కటి మాత్రం నిజం.. కనక్‌ను పొట్టనబెట్టుకున్న ఆ వ్యక్తి ఇవన్నీ చూస్తూనే ఉంటారు. దయచేసి తనకు తానుగా ముందుకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోతే మంచిది. ఎందుకంటే ఏ రోజుకైనా నిజం బయటపడక తప్పదు. ఒకవేళ ప్రత్యక్ష సాక్షులెవరైనా ఉంటే ఇప్పటికైనా సమాచారం ఇచ్చి మాకు సహాయపడండి’ అని కనక్ సోదరుడు మయాంక్ మీడియా ముఖంగా అభ్యర్థించాడు. అయినా ఆక్సిడెంట్ చేసిన ఆ వ్యక్తికి అంత మంచితనమే ఉంటే వెంటనే తానే కనక్‌ని ఆస్పత్రికి తీసుకువెళ్లేవాడు గానీ ఇలా చేయడు కదా.. అయితే కాస్త ఆలస్యమైనా సరే ఈ హిట్ అండ్ రన్ డ్రైవర్‌ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న మయాంక్ ప్రయత్నాలు తొందరగా ఫలించాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment