విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న డీఎఫ్‌వో
జన్నారం(ఖానాపూర్): జిల్లాలో స్మగ్లింగ్ నిరోధానికి డాగ్‌స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అటవీ సంరక్షణ అధికారి రామలింగం తెలిపారు. బుధవారం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురష్కరించుకుని మండల కేంద్రంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట మానవహారం ఏర్పాటు చేశారు. ఎఫ్‌డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు ఉపయోగపడే అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందన్నారు.
కవ్వాల్ టైగర్‌జోన్‌లో త్వరలో టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. డాగ్‌స్క్వాడ్ ద్వారా స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. డాగ్ ద్వారా ఎక్కడ టేకు కలప దాచి ఉన్న బయటకు వస్తుందన్నారు. వాహానాల ద్వారా తరలించినా డాగ్‌స్క్వాడ్ ద్వారా పట్టుకోవచ్చన్నారు. అలాగే అడవి లోపల నివాసం ఉంటున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
టైగర్‌జోన్ పరిధిలో కోర్ ఏరియాలో ఉండే 27 గ్రామాల్లో పర్యటించి అడవుల గురించి అవగాహన కల్పిస్తామన్నారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో అలసత్వం చేసే అధికారులపై చర్యలుంటాయన్నారు. సమావేశంలో జన్నారం, ఇందన్‌పల్లి, తాళ్లపేట్ రేంజ్ అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, దేవిదాస్, సెక్షన్ అధికారి ప్రకాశ్, వివిధ రేంజ్ పరిధిలోని అటవీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment