ఆందోళన వ్యక్తం చేస్తోన్న లారీ డ్రైవర్లు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలోని ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ గోదాం ముందు ఉంచిన మద్యం లారీలకు భద్రత కరువవుతోంది. పార్కింగ్ చేసి ఉన్న లారీ నుంచి ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు (ఈశ్వరరావు, గిరి) మద్యం బాటిళ్లు దొంగతనం చేస్తుండగా స్థానిక లారీ డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
వారం రోజుల్లో 60 సీసాలు
ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల మద్యం కంపెనీల నుంచి బెవరేజెస్ కార్పొరేషన్‌కు లారీల్లో మద్యం కేసులు వస్తాయి. గోదాంలో ఉన్న ఖాళీ బట్టి అన్‌లోడ్ చేస్తారు. గోదాంలో ఖాళీ లేకపోతే జాతీయ రహదారి నుంచి మండల కాంప్లెక్స్ వరకు ఉన్న రోడ్డుపై నిలిపి ఉంచుతారు. పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం, రక్షణ వంటి సౌకర్యాలు లేకపోవడంతో తరచూ లారీల నుంచి మద్యం బాటిళ్లు దొంగతనాలు జరుగుతున్నాయి.
ఆదివారం 11 గంటల సమయంలో శుద్ధి జలాలు లగేజ్ ఆటోలో ప్రయాణిస్తున్న ఈశ్వరరావు, గిరి.. మద్యం లారీలో టార్పాలిన్లు తొలగించి మద్యం బాటిళ్లు చోరీ చేయబోయారు. ఇంతలో వీరిని లారీ డ్రైవర్లు జి.తిరుపతిరావు, జి.రవి పట్టుకున్నారు. వీరిని ఎచ్చెర్ల పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల ఎస్సై వై.కృష్ణ కేసునమోదు చేసి, దర్యాప్తు చే స్తున్నారు.వారం రోజులుగా మొత్తం 60 సీసాల వరకూ దొంగతనానికి గురయినట్లు డ్రైవర్లు చెబుతున్నారు.
లారీ డ్రైవర్లతోనే పహారా
ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ వద్ద పదుల సంఖ్యలో మద్యం లోడింగ్ లారీలను నిలిపివేస్తున్నారు. కనీసం విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయలేదు. గోదాం లోపల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు లేవు. లారీ డ్రైవర్లు నిరంతరం పహారా కాస్తుండాలి. వీరు విశ్రాంతి తీసుకునే సమయాల్లో రక్షణ సమస్యగా మారుతోంది. లారీలకు ప్రత్యేక పార్కింగ్ స్థలం, డ్రైవర్లకు విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయలేదు. రాత్రివేళల్లో లారీల కింద నిద్రపోతుండటం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి.
కొన్నేళ్ల నుంచి ఈ సమస్యలు ఉన్నా కనీసం సంబంధిత శాఖలు స్పందించటం లేదు. మరోపక్క గోదాం సామర్థ్యం తక్కువగా ఉన్నా, లారీలు మాత్రం రోజు పదుల సంఖ్యలో కంపెనీల నుంచి వచ్చేస్తున్నాయి. మద్యం లారీల రక్షణకు షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్లు కోరుతున్నారు.
చోరీ జరిగిన లారీ
రోడ్డుపై నిలిచిపోయిన లారీలు
Comments
Please login to add a commentAdd a comment