మీర్‌పేట: మద్యం మత్తులో పక్కింటి తలుపు కొట్టిన వ్యక్తిని చితక బాదడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనంకు చెందిన మొగిలి గోపాల్ (45) కూలీగా పని చేసేవాడు. ఆదివారం మద్యం సేవించిన అతను తన సోదరిని కలిసేందుకు అమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. సోదరి ప్లాట్ అనుకొని పక్కనే ఉన్న అంజలి అనే మహిళ ప్లాట్‌కు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు.
దీంతో అంజలి బయటికి రాగా తాను పొరబడినట్లు తెలుసుకున్న గోపాల్ మంచినీళ్లు కావాలని అడిగాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పడంతో అక్కడికి వచ్చిన ఆమె సోదరుడు ఆనంద్ గోపాల్‌పై దాడికి దిగాడు. గోపాల్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆనంద్ వెనుక నుంచి బలంగా తన్నడంతో అతను మొదటి అంతస్తు మెట్లపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన గోపాల్‌ను అతని సోదరి కవిత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment