మరణంలోనూ వీడని బంధం | elderly couple died same day in chennai | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని బంధం

Published Fri, Jan 12 2018 6:56 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

elderly couple died same day in chennai - Sakshi

సాక్షి, అన్నానగర్‌: కేన్సర్‌తో బాధపడుతున్న భర్తను రక్షించుకోలేక పోతున్నాననే ఆవేదనతో భార్య సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకుంది. కాగా అదే రోజు రాత్రి పరిస్థితి విషమించి భర్త మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. చెన్నై మందవెలి సెయింట్‌ మేరీస్‌ రోడ్డుకి చెందిన ఉమామహేశ్వరి (46), ఈమె భర్త ప్రకాష్‌ వరదన్‌ (50). దంపతులకు కేశవన్‌ (19) అనే కుమారుడు ఉన్నాడు. ఎనిమిది నెలల కిందట ప్రకాష్‌ వరదన్‌కి కేన్సర్‌ ఉన్నట్లు తెలిసింది. పలు ఆపరేషన్లు చేసినప్పటికీ కేన్సర్‌ నుంచి కోలుకోలేకపోయాడు. కేన్సర్‌ నయం అయ్యే అవకాశం లేకపోవడంతో ప్రకాష్‌వరదన్‌ కొన్ని రోజులే మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. 

దీంతో ఉమామహేశ్వరి భర్తను ఇంటికి తీసుకొచ్చి బాగోగులు చూసుకునేది. ఈ స్థితిలో బుధవారం వేకువజామున ఆలయానికి వెళ్లి వస్తానని చెప్పిన ఉమామహేశ్వరి తిరిగి రాలేదు. తన కుమారుడు కేశవన్‌ సెల్‌ఫోన్‌కు ఆమె ఆడియో మెసేజ్‌ పంపింది. ఇందులో తండ్రిని బాగా చూసుకోవాలని, తాను భర్త లేకుండా జీవించలేనని పేర్కొంది. దీనిపై కేశవన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎలియట్స్‌ సముద్రతీరంలో ఉమామహేశ్వరి మృతదేహం ఒడ్డుకు చేరింది. ఇలాఉండగా అదే రోజు రాత్రి పరిస్థితి విషమించి ప్రకాష్‌వరదన్‌ మృతి చెందాడు. ఒకే రోజున కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో విషాదం నెలకొంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement