
సాక్షి, కర్నూలు : ‘‘ మేం సంపాదించింది తీసుకోండి.. అప్పులు కట్టుకోండి.. మా గురించి ఆలోచించకుండా జాగ్రత్తగా జీవించండి..మేం వెళ్తున్నాం’’ అంటూ ఒక రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్, ఆయన సతీమణి లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజాచార్యులు..పోస్ట్‌మాస్టర్‌గా రిటైర్డ్ అయ్యారు. ఆయన భార్య జయమ్మ గృహిణిగా ఉంటోంది. వీరికి భారతి, విష్ణుప్రియ, సువర్చల, గాయత్రి నలుగురు కుమార్తెలు ఉన్నారు.
వివాహం అయిన తరువాత భర్త మృతి చెందడంతో తల్లిదండ్రులతోనే దుస్తుల దుకాణం ఏర్పాటు చేయించుకొని విష్ణుప్రియ జీవనం సాగిస్తోంది. మిగిలిన ముగ్గురు కుమార్తెలు వారి భర్తల ఇళ్ల దగ్గర ఉన్నారు. విష్ణుప్రియతో శనివారం ఉదయం తెల్లవారు జామున రామాంజాచార్యులు, జయమ్మ దంపతులు గొడవ పడ్డారు. లెటర్ రాసి పెట్టి ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. జయమ్మ పుస్తెల గొలుసు సైతం ఇంట్లోనే పెట్టి వెళ్లారు. ఆ పుస్తెల గొలుసు అమ్ముకుని నలుగురు కూతుళ్లు సమానంగా పంచుకోండని లెటర్‌లో రాశారు. ఎవరెవరికి అప్పు ఇచ్చారో.. అప్పులిచ్చిన వారు ఎవరో లేఖలో పేర్కొన్నారు. తమ పేరు మీద ఉన్న 6 ఎకరాల పొలాన్ని, ఇంటి స్థలాన్ని నలుగురు కుమార్తెలు సమానంగా పంచుకోవాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వృద్ధ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment