నరసాపురంలో నిందితులను మీడియా ముందు
నరసాపురం: స్మగ్లింగ్ బంగారం తక్కువ ధరకు ఇస్తామని చెప్పి నమ్మించి.. కొందరికి చాకచక్యంగా నకిలీ కరెన్సీని అంటగడుతున్న అంతరజిల్లాల దొంగనోట్ల ముఠా సభ్యులు నలుగురిని నరసాపురం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ 1.82 లక్షల నకిలీ 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ టీటీ ప్రభాకర్‌బాబు స్థానిక విలేకరులకు గురువారం వివరించారు. పాలకొల్లు మండలం పామూరు గ్రామానికి చెందిన పంచదార లక్ష్మితో యలమంచిలి మండలం గొల్లవారిపాలెంకు చెందిన గుబ్బల వీరాస్వామి పరిచయం పెంచుకున్నాడు. తాను గతంలో గల్ఫ్‌లో పనిచేసి వచ్చానని నమ్మబలికాడు. గల్ఫ్ నుంచి స్మగ్లింగ్ బంగారం తమ దగ్గరకు వస్తుందని, సగానికి సగం తక్కువ ధరలకు ఇస్తామన్నారు. దీంతో లక్ష్మి మూడు నెలలుగా వీరికి బంగారం నిమిత్తం దఫదఫాలుగా రూ.1.40 లక్షలు ఇచ్చింది.
బాధితురాలి ఫిర్యాదుతో..
బంగారం ఎంతకీ ఇవ్వకపోవడంతో లక్ష్మి నిలదీయడం ప్రారంభించింది. దీంతో బంగారం రావడంలో ఆలస్యమైంది, నీవు ఇచ్చిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని గత నెలలో లక్ష్మిని నరసాపురం రప్పించారు. మరోవ్యక్తితో కలిసి వచ్చిన వీరాస్వామి కొంతసొమ్ము ఇచ్చి ఉడాయించారు. అయితే వారు తిరిగి ఇచ్చిన రూ.2 వేలు నోట్లు నకిలీవని గుర్తించిన లక్ష్మి నరసాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వారి కదలికలపై నిఘా పెట్టినట్టు డీఎస్పీ చెప్పారు. గురువారం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరిలో గుబ్బల వీరాస్వామిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద నకిలీ రూ.2 వేల నోట్లు 5 దొరికాయి. యలమంచిలిలోని అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా ప్రింటర్, నకిలీ రూ.2 వేల నోట్లు 91(రూ1.82 లక్షలు), రూ.20 వేల అసలు నోట్లు దొరికాయి. వీరాస్వామితో పాటుగా అక్కడ ఉన్న తూర్పుగోదావరి జిల్లా కడియపు సావరం గ్రామానికి చెందిన గుత్తుల వెంకటరమణ, ఆత్రేయపురం గ్రామానికి చెందిన ఉమ్మిది సత్యనారాయణ, పెద్దాపురం మండలం గోరంటకు చెందిన పిడుగుల శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. నలుగురూ కూడా వివిధ జిల్లాల్లో దొంగనోట్ల మార్పిడి చేస్తున్నట్టుగా గుర్తించామని చెప్పారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సీఐ ఎం.సుబ్బారావు, టౌన్ ఎస్సై కె.చంద్రశేఖర్, ఐడీ పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
దేవరపల్లిలో ఇద్దరి అరెస్ట్
దేవరపల్లి: దేవరపల్లిలో దొంగ కరెన్సీ నోట్లు మార్పిడి చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను గురువారం దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన పోలేపల్లి కిశోర్ ఎలియాస్ జోషి, తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చీకట్లపాలెంకు చెందిన శృంగాకారపు చిట్టిబాబు దొంగనోట్ల మార్పిడి చేసే ముఠాలో సభ్యులుగా ఉన్నారు. వీరిద్దరూ బుధవారం దేవరపల్లి–గోపాలపురం రోడ్డులోని టుబాకో బోర్డు సమీపంలోని గురుప్రీత్ డాబా హోటల్ వద్ద కొయ్యలగూడెం మండలం రాజవరంకు చెందిన సండ్ర వెంకటేశ్వరరావుకు రూ.2,10,900 విలువైన దొంగ కరెన్సీ నోట్లు అందజేయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై పి.వాసు అప్రమత్తమై సిబ్బందితో ముఠా సభ్యులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
దొంగనోట్లు తీసుకోవడానికి వచ్చిన వెంకటేశ్వరరావు గట్టిగా అరుస్తూ ఎస్సై వాసును బెదిరిస్తూ ప్రతిఘటనకు ప్రయత్నించగా ఎస్సై గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు డీఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు ముఠా సభ్యులను విచారించగా విజయవాడకు చెందిన వారాడ సింహాద్రి నాయుడు తమకు దొంగ కరెన్సీనోట్లు ఇచ్చి రాజవరానికి చెందిన సండ్ర వెంకటేశ్వరరావుకు అప్పగించమని చెప్పినట్టు తేలిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. పరారీలో ఉన్న ముఠా సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో కొవ్వూరు రూరల్ సీఐ సి.శరత్‌రాజ్‌కుమార్, ఎస్సై పి.వాసు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment